మూర్తి కొంచెమె అయినా ఆయన కీర్తి మాత్రం ఘనం. తెలంగాణలో పుట్టిన ఆ సాహితీశిఖరం తెలంగాణ కోసం అంకితభావంతో కృషి చేశారు.
మూర్తి కొంచెమె అయినా ఆయన కీర్తి మాత్రం ఘనం. తెలంగాణలో పుట్టిన ఆ సాహితీశిఖరం తెలంగాణ కోసం అంకితభావంతో కృషి చేశారు. అనారోగ్యం బాధిస్తున్నా, లాఠీ దెబ్బలు శరీరాన్ని సలుపుతున్నా తుది శ్వాస వరకు తెలంగాణపై ప్రేమతో ఉన్నారు.
ఆయనే దాశరథి కృష్ణమాచార్య(Dasarathi Krishnamacharya). తండ్రి పరమఛాందసుడైనప్పటికీ తను మాత్రం ప్రజా ఉద్యమాలలో పాలుపంచుకున్నారు. అప్పటి రాచరిక వ్యవస్థను ఎదురొడ్డి పోరాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న ఆయన మాట నిజామాబాద్(Nizamabad) జైలు గోడలు దాటి బయటి ప్రపంచాన్ని చైతన్యపరిచింది.
విశ్వవ్యాప్తమైంది. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి.. నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడు. తెలుగు సాహిత్యంలో విశిష్ఠ స్థానం సంపాదించిన దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 ఉమ్మడి వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు.
ఆయనొచ్చాక తెలుగుపాట హోయలు పోయింది. వెన్నెల స్నానాలు చేసింది. ఖుషీ ఖుషీగా నవ్వింది. చలాకి మాటలు రువ్వింది. అసలు తెలుగులో ఖవాలి గీతాలకు శ్రీకారం చుట్టిందే ఆయన! దాశరథి సినిమాల్లోకి వచ్చేనాటికే పరిశ్రమలో సీనియర్ సముద్రాల, పింగళి, కొసరాజు, శ్రీశ్రీ, ఆత్రేయ, దేవులపల్లి, ఆరుద్ర వంటి దిగ్గజాలు సినీ కవులుగా ప్రసిద్ధులు.అటువంటి మహామహుల మధ్య తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులో గాలిబ్ గీతాల పేరున అనువదించాడు. తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు.. ఇప్పటికీ ఎందరో తెలంగాణ వాదులకు ఉత్తేజాన్ని కలిగించాయి. ఉద్యమకారులకు స్పూర్తినిచ్చాయి. దాశరథి కృష్ణమాచార్య 5 నవంబర్ 1987న కీర్తిశేషులయ్యారు.