ఎవరెంతగా చెబుతున్నా.. పర్యావరణవేత్తలు ఎంతగా మొరపెట్టుకుంటున్నా...
ఎవరెంతగా చెబుతున్నా.. పర్యావరణవేత్తలు ఎంతగా మొరపెట్టుకుంటున్నా... స్థానికులు ఆందోళన చెందుతున్నా కాంగ్రెస్(congress) ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అనుకున్నట్టుగానే వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ కేంద్రాని(VLF Navy Radar Station)కి ఇవాళ మధ్యాహ్నం 12.55 గంటలకు శంకుస్థాపన చేస్తున్నారు. పదేళ్ల కిందటే రాడార్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కనపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 3200కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ రాడార్ కేంద్రం కోసం దామగుండం అటవీ ప్రాంతంలో 2900 ఎకరాల అటవీ భూములను నేవీకి అప్పగించారు. ఈ భూముల్లో లక్షా 93 వేల చెట్లు, 400 ఎకరాల్లో గడ్డి భూములు ఉన్నాయి. 500 ఏళ్ల నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అనేక ఔషధ మొక్కలు, 258 రకాల పక్షిజాతులు, జింకలు, దుప్పిలు, నెమళ్లు ఉన్నాయి. రాడార్ కేంద్రంతో అటవీ సంపద నాశనం అవుతుందని, జీవవైవిద్యం దెబ్బతింటుందని పర్యావేరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దామగుండంలో అడవుల్లో పుట్టే మూసీ, ఈసీ నదులు ప్రమాదంలో పడుతాయని భయపడుతున్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలు, దామగుండం అటవీ ప రిరక్షణ జేఏసీ న్యాయస్థానాలలో అనేక పిటిషన్లు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ప్రజాభిప్రాయం కంటే రాడార్ కేంద్రమే ప్రధానమైంది.