మటన్(Mutton) కోసం పెళ్లిళ్లలో కొట్లాడుకోవడం చాలా సార్లు వినేఉంటాం.
మటన్(Mutton) కోసం పెళ్లిళ్లలో కొట్లాడుకోవడం చాలా సార్లు వినేఉంటాం. నల్లిబొక్క కోసం కుటుంబమే విడిపోవడం కూడా ఓ సినిమాలో చూశాం. తాజాగా పెళ్లి విందులో మటన్ ముక్కలు తక్కువగా వడ్డిస్తున్నారని గోలగోల చేశారు. చివరకి పోలీసులు జోక్యం చేసుకొని కేసులు నమోదు చేసేదాక ఈ వ్యవహారం వెళ్లింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిజామాబాద్(Nizamabad) జిల్లా నవీపేటలో ఈ ఘటన జరిగింది.
పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు(Groom), వధువు(Bride) తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో వివాహం జరిగింది. ఆ తర్వాత విందులో వరుడు తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ మటన్ ముక్కలు తక్కువగా వడ్డిస్తున్నారంటూ కొందరు యవకులు వడ్డించే వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్లు, కర్రలు, వంట సామానుతో పరస్పరం దాడులకు దిగి రణరంగమే సృష్టించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ఇరు వర్గాలకు చెందిన 19 మందిపై కేసులు నమోదు చేశారు. గాయపడ్డ సత్యనారాయణ, సాయిబాబా అనే వ్యక్తులతో పాటు మరో ఎనిమిది మందిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.