బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరడం హాట్ టాపిక్ గా మారింది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ఆ పార్టీలోకి చేరేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరడం హాట్ టాపిక్ గా మారింది. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్ లో చేరారు. ఎంపీ వెంకటేష్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వెంకటేష్‌ను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు.

లోక్ సభ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ అని చెబుతున్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేశ్ కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మంచిర్యాల, చెన్నూర్,బెల్లంపల్లి బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో వెంకటేష్ నేత కనిపించలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పల్లి స్థానానికి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. త్వరలో మరికొందరు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది.

Updated On 6 Feb 2024 12:32 AM GMT
Yagnik

Yagnik

Next Story