దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా చటుక్కుమని వాలిపోయి నామిషేన్‌ వేయడం, పోటీ చేయడం, డిపాజిట్‌ కోల్పోవడం ఆయనకు పరిపాటి.. అందుకే ఆయన ఎలెక్షన్‌ కింగ్‌(Election King) అయ్యారు. ఈ ఘనత కారణంగానే ఆ ఎన్నికల రారాజు ఢిల్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో(Delhi Book Of Records) స్థానం సంపాదించుకున్నాడు.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా చటుక్కుమని వాలిపోయి నామిషేన్‌ వేయడం, పోటీ చేయడం, డిపాజిట్‌ కోల్పోవడం ఆయనకు పరిపాటి.. అందుకే ఆయన ఎలెక్షన్‌ కింగ్‌(Election King) అయ్యారు. ఈ ఘనత కారణంగానే ఆ ఎన్నికల రారాజు ఢిల్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో(Delhi Book Of Records) స్థానం సంపాదించుకున్నాడు. నాయకుడు కాని ఆ నాయకుడు పేరు పద్మరాజన్‌(Padma Rajan). తమిళనాడులోని సేలం జిల్లా మేట్టూరు దగ్గర ఉన్న ఎరటై పులియ మరత్తూరు గ్రామం ఆయన స్వస్థలం. వృత్తిరీత్యా హోమియోపతి(Homeopathy) వైద్యుడు. ఇప్పుడాయన ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై పోటీకి సిద్ధమయ్యారు. ఇది ఆయనకు 237వ పోటీ అవుతుంది. ఇప్పటి వరకు ఆయన 236 సార్లు పోటీ చేశారు. ఒక్కసారైనా గెలిచారా అంటే ఊహూ! ధరావత్తుకే దిక్కులేదు.. గెలవడం కూడానా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలు జరిగినా మొదటిరోజే నామినేషన్‌ వేసే ఎన్నికల వీరుడు పద్మరాజన్‌ ఇప్పుడు మొదటిసారిగా సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గం(Gajwel constituency) నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మొన్న 3వ తేదీన నామినేషన్‌(Nomination) వేశారు. 65 ఏళ్ల ఈ ఎన్నికల వీరుడు 1988 నుంచి అనేక ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో ఆరితేరాడు. సహకార సంఘాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఎమ్మెల్యేల మద్దతు లేని కారణంగా నామినేషన్‌ తిరస్కరణకు గురైందనుకోండి.. అది వేరే విషయం!

ఇప్పటి వరకు 32సార్లు లోక్‌సభకు, 41 సార్లు రాజ్యసభ్యకు, 72 సార్లు అసెంబ్లీకి, మూడుసార్లు ఎమ్మెల్సీకి, ఒకసారి మేయర్‌ పదవికి, మూడుసార్లు ఛైర్మన్‌ పదవికి, ఇంకా అనేకానేక ఇతర ఎన్నికల్లో పోటీ చేశారు. అన్నట్టు మన పద్మరాజన్‌ రాష్ట్రపతి ఎన్నికలను కూడా వదల్లేదు. అయిదుసార్లు రాష్ట్రపతి ఎన్నికల్లో, మరో అయిదుసార్లు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. నాలుగు మార్లు ప్రధానమంత్రి అభ్యర్థులకు ప్రత్యర్థిగా, 13 రాష్ట్రాలలో ముఖ్యమైన అభ్యర్థులకు పోటీగా, ఏడుసార్లు పార్టీల అధినేలకు పోటీగా నామినేషన్లు వేశారు. ప్రతి ఎన్నికల్లోనూ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి డిపాజిట్‌ సొమ్ముచెల్లించడం పద్మరాజన్‌ అలవాటు. ఇంతవరకు వార్డు సభ్యుడిగా కూడా గెలవనప్పటికీ, రికార్డులను మాత్రం పెద్దఎత్తున తన సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు అరకోటి రూపాయల వరకు ఖర్చు చేసి ఉంటారు. ఈయనగారి గొప్పతనాన్ని గుర్తించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఢిల్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఈయనకు చోటు కల్పించాయి. పరాజయంతో కుంగిపోకూడదని, ప్రయత్నం చేస్తూ వెళుతుంటే ఎప్పుడోసారి విజయం వరిస్తుందని పద్మరాజన్‌ చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయచ్చని చెప్పడానికే తాను ఇలా పోటీ చేస్తున్నానని తెలిపారు.

Updated On 7 Nov 2023 2:48 AM GMT
Ehatv

Ehatv

Next Story