నాగర్‌కర్నూలు(Nagarkarnool) జిల్లా బిజినేపల్లి(Bijinepalli) మండలం ఖానాపూర్‌లో వేమారెడ్డి అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది.
నాగర్‌కర్నూలు(Nagarkarnool) జిల్లా బిజినేపల్లి(Bijinepalli) మండలం ఖానాపూర్‌లో వేమారెడ్డి అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది. సారీ కరెంట్ బిల్లు షాక్(Current bill) తగిలింది. 21 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు రావడంతో బిత్తరపోయాడా వ్యక్తి. 01-01-1970 నుంచి 05-06-2024 వరకు 998 రోజులపాటు 297 యూనిట్లు వినియోగించినట్టు బిల్లులో ఉంది. ఇందుకోసం 21,47,48,569 రూపాయలు చెల్లించాల్సిందిగా అందులో ఉంది. అసలు 1970 నుంచి ఇప్పటి వరకు 998 రోజులేమిటో, 297 యూనిట్లేమిటో .. అంతా గందరగోళంగా ఉంది. ఈ నెల 5వ తేదీన వినియోగదారులకు కరెంట్ బిల్లులు వచ్చాయి. ఖానాపూర్ గ్రామంలో ఇలా పది మందికి కోట్ల రూపాయలలో బిల్లులు వచ్చాయి. అవగాహన లేని బయటి వ్యక్తులు లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్ పనులు చేస్తున్నట్టు, వారే ఈ విద్యుత్తు బిల్లులను ఇస్తున్నట్టు సమాచారం. అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో విద్యుత్తు శాఖకు సంబంధించిన ప్రతి పనిని ప్రైవేట్ వ్యక్తులతో చేయిస్తున్నారు. ఈ విషయంపై ఏఈ మహేశ్‌ను వివరణ అడిగితే టెక్నికల్ మిస్టేక్ అని చెప్పారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు బిల్లులను వెంటనే సరిచేశామన్నారు.