కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపు మేరకు ఎంపీ రవిచంద్ర, నామా నాగేశ్వరరావుతో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు, వైరాలలో శనివారం "అన్నదాతకు అండగా రైతు భరోసా దీక్ష"లలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోతున్నదని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లు, గృహ వినియోగదారులకు 24గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎంపీ వద్దిరాజు వివరించారు.
అలాగే, సామాజిక పింఛన్లను రూ.4వేలకు పెంచుతామని హామీనిచ్చి అమలు చేయడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని, క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని ఎంపీ వద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.