గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించాలని ఎమ్మెల్సీ కవిత సవరణలను ప్రతిపాదించారు.

MLC Kavitha Slams On Governor Tamilisai Speech
గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించాలని ఎమ్మెల్సీ కవిత సవరణలను ప్రతిపాదించారు. అయితే, శాసనమండలి(Legislative Council) తొలి రోజే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నారు.
కవిత మీడియాతో మాట్లాడుతూ.. అభ్యంతరకరమైన పదాలను గవర్నర్ ప్రసంగంలో నుంచి తొలగించాలంటూ తాను సవరణలు ప్రతిపాదించానని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ(Telangana) ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అవమానించేలాగా వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. కానీ మండలి సమావేశం తొలిరోజే కాబట్టి కాంగ్రెస్)Congress) ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కొత్త ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపాదన ఉపసంహరించుకున్నానని వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి మండలిలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో తమ సవరణలు ఆమోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సహకరించాలి అన్న ఆలోచనతో ఉపసంహరించుకున్నామని చెప్పారు. అదే స్ఫూర్తిని ప్రభుత్వం కూడా కొనసాగించాలని సూచించారు. ఎంతసేపూ.. గడిచిపోయిన కాలం.. జరిగిన తప్పులను ఎన్నడం కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి, తెలంగాణ ప్రగతికి సంబంధించి రోడ్ మ్యాప్(Road Map) ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు.
గవర్నర్ ప్రసంగాన్ని చూసి చాలామంది బాధపడ్డానని, ప్రజలు ఓట్లేసి భారీ మెజరిటీతో గెలిపించిన ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంగంలో విపరీతమైన వ్యాఖ్యలు చేయడం అందరిని బాధించిందని అన్నారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలుగా, నియంతృత్వ ప్రభుత్వాలుగా గవర్నర్ ప్రసంగంలో దూషించే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో ఆ వ్యాఖ్యలపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.
