కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రుతుక్రమ సెలవులపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

MLC Kavitha Reacts on Smriti Irani Comments
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) రుతుక్రమ సెలవు(Menstrual Leave)లపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌లో.. రాజ్యసభ(Rajya Sabha)లో రుతుక్రమ పోరాటాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కొట్టిపారేయడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక మహిళగా.. ఇటువంటి అజ్ఞానాన్ని చూడటం చాలా భయంకరంగా ఉందని అన్నారు. ఋతుస్రావం ఎంపిక కాదు.. అది జీవ వాస్తవికత.. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాక మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్టవుతుందని అన్నారు. ఒక మహిళగా.. మహిళలు ఎదుర్కొనే నిజమైన సవాళ్లు, ప్రతిదానికీ మనం ఎదుర్కోవాల్సిన పోరాటం పట్ల సానుభూతి లేకపోవడం విస్తుగొలిపే విషయం అని రాసుకొచ్చారు.
బహిష్టు(రుతుక్రమం) సమయంలో సెలవు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్నకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ.. ఆ అవసరం లేదన్నారు. బహిష్టు అనేది మహిళ జీవితంలో సహజమైన అంశమని.. అది వైకల్యం కాదని కేంద్ర మంత్రి అన్నారు. మహిళలకు బహిష్టు సమయంలో సెలవులు ఇవ్వడానికి ఎలాంటి పాలసీ అవసరం లేదని ఆమె సూచించారు.
బుధవారం ప్రశ్నోత్తరాల సమయం(Question Hour)లో రాజ్యసభలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా(MP Manoj Jha).. బహిష్టు సమయంలో మహిళలకు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వడంపై ఏం చేశారని మంత్రిని ప్రశ్నించారు. 1990వ దశకం ప్రారంభంలో బహిష్టు సమయంలో సెలవులు మంజూరు చేసిన మొదటి రాష్ట్రంగా బీహార్(Bihar) అవతరించిందని ఝా చెప్పారు. ఆ తర్వాత కేరళ(Kerala) కూడా అదే బాటలో సెలవు ఇచ్చిందన్నారు.
ఇందుకు కేంద్రమంత్రి ఇరానీ స్పందిస్తూ.. రుతుక్రమం సహజమైన ప్రక్రియ అని అన్నారు. ఆ రోజుల్లో కొంతమంది మహిళలు మాత్రమే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా సందర్భాలలో ఎటువంటి సమస్య ఉండదన్నారు.
గత వారం కాంగ్రెస్(Congress) ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇరానీ.. మహిళలకు నిర్బంధంగా వేతనంతో కూడిన రుతుక్రమ సెలవులు ఇచ్చే ప్రతిపాదన ఏదీ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.
