రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు. ప్రజాదర్బార్ వేదికకు వివిధ సమస్యలపై విన్నవించుటకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల విజ్ఞాపనలు ముఖ్యమంత్రి స్వీకరించి, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ (సీతక్క) కూడా ఆయన వెంట ఉన్నారు.
ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిమిత్తం సెక్రటేరియట్ బయలుదేరగా.. అనంతరం ప్రజా దర్బార్ కు వివిధ సమస్యల పరిష్కారానికై వచ్చిన ప్రతిఒక్కరి నుండి మంత్రి సీతక్క విజ్ఞాపనలు స్వీకరించారు. ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విసృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జలమండలి ఎం.డి. దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ముషార్రాఫ్ తదితర అధికారులు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు.
గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ లకు 15 డేస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి విజ్ఞాపన పత్రాన్ని ఆన్ లైన్ ఎంట్రీ చేసి, ప్రతి విజ్ఞాపన కు ప్రత్యేక (Unique ) గ్రీవెన్స్ నెంబర్ (ID generate ) ఇచ్చి, ప్రింటెడ్ ఎకనాలెడ్జిమెంట్ ఇవ్వడం, పిటిషన్ దారులకు SMS ద్వారా కూడా ఎకనాలెడ్జిమెంట్ పంపేవిధంగా ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ లోపల ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణకై క్యూలైన్ల పైన నీడను కల్పించారు. ద్వారాల వద్ద నిలుచున్న వారికి , ప్రజాదర్బార్ లోకి వచ్చిన ప్రజలకు తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. హైదరాబాద్ నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి విజ్ఞాపనలతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ కిక్కిరిసింది.