అలగడమా? నాన్సెన్స్.. అలాంటిదేమీ లేదు... పొన్నం ప్రభాకర్!
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ(Balkampet yellamma) కల్యాణోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి(Gadwala Vijayalakshmi) అలిగి ఆలయం బయటే ఉన్న దృశ్యాలను మనం చూశాం!
అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించ లేదని పొన్నం ప్రభాకర్ దంపతులు, జీహెచ్ఎంసీ(GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మి లు అలక బూని, ఆలయం బయట అరుగు మీదే కూర్చుండి పోయారు.! ఈ క్రమంలో అధికారులపై అసహనం, కోపంతో మంత్రి ఊగిపోయారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాను అలిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదంటున్నారు పొన్నం ప్రభాకర్. తాను అలగలేదని, మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందని, తోపులాట నివారించడానికే కాసేపు ఆగి అధికారులతో మాట్లాడామని పొన్నం వివరణ ఇచ్చుకున్నారు. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించామే తప్ప కోపగించుకోలేదని, అయినా అమ్మవారి భక్తులం ఎందుకు అలుగుతాము అని పొన్నం ప్రశ్నించారు. అలాగే మహిళా రిపోర్టర్‌కు ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణ చెబుతున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సంఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా రియాక్టయ్యారు. ‘మా ప్రభుత్వంలో మాపై మేము ఎందుకు అలుగుతాము..? తోపులాట వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నామని బయటే ఆగాం. అధికారులతో మాట్లాడి రద్దీని కంట్రోల్ చేయగలిగాం. అమ్మ వారి ముందు అలగడం ఉండదు’ అని విజయలక్ష్మి చెప్పుకొచ్చారు.