ముదిమి వయసులో తండ్రికి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులది!
ముదిమి వయసులో తండ్రికి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులది! కర్తవ్యం కూడా! అలాంటిది ఓ కొడుకు తండ్రిని బిచ్చమెత్తుకునేలా(Begging) చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని కూడా లాగేసుకుని రోడ్డున పడేశాడు. పాపం ఆ తండ్రి స్థానిక ఆర్డీవోను కలుసుకుని తన వ్యధాభరితగాధను చెప్పుకున్నాడు. ఆర్డీవో వెంటనే స్పందించారు. ఆ పెద్ద మనిషికి న్యాయం చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల(sircilla) జిల్లాలో జరిగింది. సిరిసిల్లకు చెందిన అదువాల రాజమల్లుకు అనిల్ కుమార్, సురేశ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండేళ్ల కిందట కేసీఆర్ ప్రభుత్వం తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ నగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని కేటాయించింది. ఆ ఇంటిని బలవంతంగా పెద్దకొడుకు అనిల్‌కుమార్ తన భార్య పేరిట రాయించుకున్నాడు. ఆరు నెలలుగా రాజమల్లును కొడుకులు పట్టించుకోవడం లేదు. దాంతో భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకోవాల్సిన దుస్థితి వచ్చిందాయనకు! తన దుస్థితిని ఆర్డీవోకు వివరించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. దాంతో తంగల్లపల్లి ఎమ్మార్వో కు పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో రమేశ్ ఆదేశించారు. విచారణ జరిపిన తంగళ్లపల్లి తహసీల్దార్ రాజమల్లు ఆరోపణలు నిజమేనని తేల్చారు. దీంతో పెద్ద కొడుకు డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని వారం రోజుల్లో ఖాళీ చేసి తండ్రికి అప్పగించాలని, కొడుకులు ఇద్దరూ ప్రతినెల తండ్రికి 2 వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఆర్డీవో ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని రాజమల్లు పేరున మార్చాలని తహసీల్దారు ఆదేశించారు. అనిల్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు.