న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని చాలా కాలంగా చాలా మంది మేథావులు చెబుతూ వస్తున్నారు.
న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని చాలా కాలంగా చాలా మంది మేథావులు చెబుతూ వస్తున్నారు. న్యాయం కోర్టుల చుట్టూ సుదీర్ఘకాలం తిరిగి తిరిగి ప్రజలకు కూడా విసుగొస్తున్నది. అంఉకే చాలా మంది రాజీ పడుతున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరు ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి ఈ యధార్థ సంఘటన ఉదాహరణ. 2013 ఫిబ్రవరిలో ఉమ్మడి మెదక్(Medak) జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలోని గుండెల పోచయ్యను(Gundela Pochaiah) పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నతల్లిని పోషించలేక పోచయ్యే టవల్‌తో చెట్టుకు ఉరి వేసి చంపాడన్నది పోలీసుల అభియోగం! 2015 జనవరిలో సిద్ధిపేట కోర్టు పోచయ్యకు యావజ్జీవ శిక్ష విధించింది. ఇదిలా ఉంటే పోచయ్య తరఫున అతడి చిన్న కొడుకు దావిద్ హైకోర్టులో(High court) అప్పీల్ చేశాడు. బెయిల్ పిటిషన్ వేశాడు. హైకోర్టు దాన్ని కొట్టేసింది. 2018లో పెరోల్‌కు(Perol) దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు పెరోల్ ఇచ్చింది. విషాదమేమిటంటే పెరోల్ మీద బయటకు రావాల్సిన పోచయ్య అందుకు ముందు రోజే చనిపోవడం! గుండెపోటుతో(Heart attack) కన్నుమూశాడని జైలు అధికారులు చెప్పారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందచేశారు. కుటుంబసభ్యులు అంత్యక్రియలు కూడా జరిపించారు. ఇది జరిగి ఆరేళ్లు అయ్యింది. హైకోర్టులో పోచయ్య తరఫున ఉన్న ఆ అప్పీల్ పిటిషన్ అలాగే ఉండింది. పదేళ్లు దాటిన కేసుల తక్షణ పరిష్కారం పేరుతో ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పోచయ్య కేసు అలా తెరమీదకు వచ్చింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా స్వీయ నేరాంగీకార ప్రకటన ఆధారంగా పోచయ్యకు ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించిందని హైకోర్టు భావిస్తూ పోచయ్యను నిర్దోషిగా ప్రకటించింది. జైలు నుంచి బయటకు రావడానికి పోచయ్య ఇప్పుడు లేడు. చేయని నేరానికి దోషిగా శిక్షను అనుభవిస్తూ మనో వేదనకు గురై మరణించిన పోచయ్యను ఆరు సంవత్సరాల తర్వాత నిర్దోషిగా తేల్చడం వల్ల ప్రయోజనమేమిటి? ఈ పాపం ఎవరిది? జైల్లో పోచయ్య కోల్పోయిన జీవితాన్ని ఎవరు తిరిగి తెస్తారు. జైల్లో ఉన్నాడు కాబట్టి చనిపోయాడు. అదే బయట ఉండే బతికేవాడేమో! ఇలా ఉంటాయి కోర్టు వ్యవహారాలు!