కరెంట్ బిల్లు(Current bill) చూసి షాక్ తిన్నాడో వ్యక్తి.
కరెంట్ బిల్లు(Current bill) చూసి షాక్ తిన్నాడో వ్యక్తి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామంలో గట్ట సంపత్ గౌడ్ అనే వ్యక్తి 2016లో గృహ విద్యుత్తు మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మీటర్ వచ్చినప్పటికీ నాలుగు నెలలైనా బిల్లు రాకపోయేసరికి గ్రామంలోనే ఉన్న లైన్‌మన్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పుకున్నాడు. ఇంకా మీటర్ ఆన్‌లైన్‌లో నమోదు(Online registered) కాలేదని లైన్‌మన్ చెప్పారు. ఇక అప్పటి నుంచి ఈ సమస్యపై అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సంపత్ గౌడ్! ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది జూన్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీకి వచ్చారు. విషయాన్ని చెన్నూరు ఏడీఈకి ఫిర్యాదు చేశారు. అప్పుడు కానీ మీటర్ నంబర్ రాలేదు. మీటర్ వచ్చిన తర్వాత జులైలో బిల్లు తీశారు. బిల్లు అమౌంట్ ఎంతంటే 1,47, 222 రూపాయలు. ఆ అమౌంట్ చూసి సంపత్ కంగుతిన్నారు. బిల్లు పట్టుకుని అధికారులను కలిశాడు. అదికారులు మాత్రం బిల్లు కట్టాల్సిందేనని చెప్పేశారు. దాంతో చెన్నూర్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట గ్రామస్థులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపాడు సంపత్ గౌడ్. కొమ్మెర ఏఈ శ్రీనివాస్‌ను కలిస్తే సంపత్ డీడీ తీసి ఇస్తే మీటర్‌ను చెకింగ్ కోసం పంపుతామని అన్నారు.