మరో మూడు నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు బీఆర్‌ఎస్ పార్టీకి ఎంత కీలకమో, కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ముఖ్యం! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా నైరాశ్యంలోని వెళ్లిన బీఆర్‌ఎస్ క్యాడర్ పునరుత్తేజం పొందాలంటే విజయమనే టానిక్ ఎంతో అవసరం! అందుకే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడమే టార్గెట్‌గా పెట్టుకుంది బీఆర్‌ఎస్.
మరో మూడు నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు బీఆర్‌ఎస్ పార్టీకి ఎంత కీలకమో, కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ముఖ్యం! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా నైరాశ్యంలోని వెళ్లిన బీఆర్‌ఎస్ క్యాడర్ పునరుత్తేజం పొందాలంటే విజయమనే టానిక్ ఎంతో అవసరం! అందుకే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడమే టార్గెట్‌గా పెట్టుకుంది బీఆర్‌ఎస్. ఇప్పట్నుంచే వ్యూహరచన చేస్తోంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే తెలంగాణలో విజయం సాధించి ప్రభుత్వంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. లోక్‌సభ ఎన్నికలు రేవంత్‌కు అత్యంత కీలకం! ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని నిలబెట్టుకోవడం రేవంత్ ముందున్న సవాల్! అందుకే తన శక్తి యుక్తులన్నీ ధారపోస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏదైనా తేడా కొడితే పార్టీలో ఆయన వ్యతిరేకులకు అస్త్రం దొరికినట్టు అవుతుంది. విమర్శలు వస్తాయి. బీఆర్‌ఎస్ నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం నుంచి విజయం సాధించారు. అప్పుడాయనకు లభించిన మెజారిటీ కేవలం 10,919 ఓట్లు మాత్రమే! అది కూడా ఆఖరి రౌండ్లలో! అప్పటి వరకు బీఆర్‌ఎస్ అభ్యర్థే ముందున్నారు. ఎంపీ గా ఉన్నారు కాబట్టే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దల దగ్గర తన పలుకుబడి పెంచుకోగలిగారు. కాంగ్రెస్ అధిష్టానం మన్ననలను పొందగలిగారు. అధినాయకత్వం అండదండలతో ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఓట్లను లెక్కేస్తే కాంగ్రెస కంటే బీఆర్‌ఎస్‌కు మూడున్నర లక్షలకు పైగా ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ లెక్కలు రేవంత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిలో మళ్లీ కాంగ్రెస్‌నే గెలిపించాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారిప్పుడు. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు రేవంత్‌రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు తొమ్మిది ఎంపీ నియోజకవర్గ పరిధిలోనే ఆధిక్యం వచ్చింది. కొన్ని చోట్ల స్వల్ప మెజారిటీనే! ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 14పైగా లోక్‌సభ సీట్లు గెలుస్తామని చెబుతూ వస్తోంది. అది సాధ్యమయ్యేనా? కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తి చెందితే తప్ప అది సాధ్యం కాదు. ఆ సమయానికి ప్రజల మూడ్ ఎలా ఉంటుందో ఏమో! మొత్తానికి రేవంత్‌రెడ్డికి మాత్రం రానున్న రెండు నెలలు సంక్లిష్టమైనవే!