పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్ విమర్శించారు.
పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్ విమర్శించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం పేరిట ఆనాడు యువతను రెచ్చగొట్టి వారి బలిదానాలకు కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ లు కారణమయ్యారని.. ఇప్పుడు కూడా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇంటికో ఉద్యోగం ఇవ్వడం కుదరదని మాట మార్చిన చరిత్ర కెసిఆర్ ది అన్నారు. తన 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలన్నారు. ఉద్యోగాల ఖాళీల గుర్తింపు కోసం నియమించిన ఐఏఎస్ కమిటీ సుమారు మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇచ్చిన నివేదికను కూడా పక్కన పెట్టాడని విమర్శించారు. ప్రశ్నించిన వారిని గొంతు నొక్కిందుకే కేవలం పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ చేశాడని విమర్శించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో బిజెపి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం యువతను మరోసారి బలిచేస్తారా ..? అని ప్రశ్నించారు.
వారితో దీక్షలు, ఆందోళనలు చేయిస్తూ తెర వెనుక బీఆర్ఎస్ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ నిరసనలలో నిరుద్యోగుల కంటే ఎక్కువ బీఆర్ఎస్ శ్రేణులే ఉన్నారని పేర్కొన్నారు. మీ హాయంలో కనీసం నిరుద్యోగులు బాధ వినకుండా వారి గొంతు నొక్కిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
తమ కాంగ్రెస్ సర్కారు ఉద్యోగాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 28,942 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారని పేర్కొన్నారు. కోర్టు కేసులను ఛేదించి.. గ్రూప్ 1, డీఎస్సీ, గ్రూప్ 2, ఆర్టీసీ లలో నియామకాల కోసం ఇప్పటికే పరీక్షల నిర్వాణకు సంబంధించిన ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందేనన్నారు.
మరోసారి బీఆర్ఎస్ ఉచ్చులో యువత పడొద్దని ఆయన సూచించారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఉద్యోగ నియామకాలు ప్రభుత్వం చేపడుతుందని వివరించారు.