హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న అసదుద్దీన్ ఒవైసీ.. మైనారిటీలకు, హిందువులకు న్యాయం చేయట్లేదని
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ లోక్ సభ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత తీవ్ర విమర్శలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ ఇకపై చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ రిలీజ్ చేసిన లోక్‌సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌లో హైదరాబాద్ అభ్యర్థిగా మాధవి లత పేరును ప్రకటించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ్ పరివార్ నుంచి వచ్చానని, పార్టీలో లేనన్న కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోనన్నారు. సొంత ఇంట్లో వాళ్లు చేసే వ్యాఖ్యలు ఇబ్బందికరం కాదని.. సంఘ్ పరివార్ కార్యకర్తగా చేసిన సేవే తనకు టికెట్ వచ్చేలా చేసిందని అన్నారు. ధర్మం, న్యాయం తెలిసిన తాను ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు.
హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న అసదుద్దీన్ ఒవైసీ.. మైనారిటీలకు, హిందువులకు న్యాయం చేయట్లేదని మాధవి లత అన్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మార్పు కచ్చితంగా ఉంటుందని కొంపెల్ల మాధవి లత ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోక్ సభలో పరిశుభ్రత, విద్య, వైద్య సదుపాయాలు లేవు. మదర్సాలలో పిల్లలకు తిండి దొరకడం లేదు. దేవాలయాలు, హిందువుల ఇళ్లను ఆక్రమిస్తున్నారు. ముస్లిం పిల్లలు చదువుకోలేదు. బాల కార్మికులు ఉన్నారని మాధవి లత తెలిపారు. ఓల్డ్ సిటీ పర్వతం ప్రాంతం కాదు. హైదరాబాద్ మధ్యలో ఉన్నా అక్కడ పేదరికం ఉందన్నారు. ఆమె ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్‌ను సోమాలియాతో పోల్చారు. లత విరించి హాస్పిటల్స్ చైర్‌పర్సన్, లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ స్థాపకురాలు. హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వేతర సంస్థ అయిన తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఆమె హైదరాబాద్ ప్రాంతంలో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు.