ఇదో చిత్రమైన ప్రేమకథ! ట్యాక్సీ డ్రైవర్(Taxi driver) ఉచ్చులో పడిన ఓ మహిళ సైబరాబాద్ పోలీసులను బెంబేలెత్తించింది.
ఇదో చిత్రమైన ప్రేమకథ! ట్యాక్సీ డ్రైవర్(Taxi driver) ఉచ్చులో పడిన ఓ మహిళ సైబరాబాద్ పోలీసులను బెంబేలెత్తించింది. లండన్‌లో(London) ఉన్న భర్తకు చికాకు తెప్పించింది. గూగుల్ పేమెంట్(Google pay) దీనికంతటికి కారణం కావడం గమనార్హం.
హైదరాబాద్ అల్వాల్(Alwal) ప్రాంతంలో 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కూతురుతో దంపతులు హాయిగా కాపురం చేసుకుంటున్నారు. భర్తకు లండన్‌లో ఉద్యోగం రావడంతో భార్యా పిల్లలను హైదరాబాద్‌లోనే ఉంచి గత ఏడాది నవంబర్‌లో భర్త లండన్‌కు వెళ్లాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు మహిళ తల్లి చనిపోఇంది. అస్థికలు కలపడానికి ఓ ట్యాక్సీని మాట్లాడుకుని వెళ్లి వచ్చింది. ఆ ట్యాక్సీ డ్రైవర్‌కు గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించింది. కథ ఇక్కడే మొదలయ్యింది. ఆమె ఫోన్ నంబర్‌ను తీసుకున్న ఆ ట్యాక్సీ డ్రైవర్ తరచూ ఫోన్ చేసి ఆమెపై ప్రశంసలు కురిపించసాగాడు. అలా నెమ్మదిగా ఆమెపై ప్రేమ వల వేశాడు. అందులో ఆమె చిక్కుకుపోయింది. ఇదంతా గమనించిన అత్తమామలు లండన్‌లో ఉంటున్న కొడుకుకు కబురందించారు. వెంటనే భర్త అప్రమత్తమయ్యాడు. సెప్టెంబర్ 16వ తేదీన భార్యా పిల్లలను లండన్‌కు రప్పించుకున్నాడు. అంతలోనే భర్త తల్లి చనిపోయింది. దాంతో భార్యా పిల్లలను లండన్‌లోనే ఉంచి సెప్టెంబర్ 29న హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ మరుసటి రోజున పిల్లలు పార్కులో ఆడుకుంటుండగా... ఇప్పుడే వస్తానంటూ ఆ మహిళ ఇండియాకు వచ్చేసింది. గంటలు గడుస్తున్నా అమ్మ ఇంటికి రాకపోయేసరికి పిల్లలు గాబారా పడ్డారు. అమ్మ కనిపించడం లేదంటూ ఇండియాలో ఉన్న తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. పాపం ఆ భర్త తల్లి కర్మకాండలను వదిలిపెట్టేసి లండన్‌కు పరుగు తీశాడు. అక్కడ భార్య గురించి ఆరా తీశాడు. ఆమె అక్టోబర్ 3వ తేదీన శంషాబాద్‌లోని మధురానగర్‌లో ఉన్నట్టు గుర్తించాడు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడేందుకుట్రై చేస్తే ఒకసారి ఆమె ఫోన్ కనెక్ట్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ.. ఎవరో తనను కిడ్నాప్ చేశారంటూ చెబుతూ ఫోన్ కట్ చేసింది. ఆందోళన చెందిన భర్త తన భార్యను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఈ మెయిల్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో
రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే, తనను ట్యాక్సీ డ్రైవర్ ట్రాప్ చేసి గోవాకు తీసుకొచ్చాడని, తనను కాపాడి తన భర్త దగ్గరకు చేర్చాలంటూ హైదరాబాద్‌లో ఉన్న ఆమె భర్త స్నేహితులకు చెప్పుకుని లైవ్ లోకేషన్ షేర్ చేసింది. ఈ ఫోన్ నంబర్‌ను వారు సైబరాబాద్ పోలీసులకు పంపించారు. సోమవారం ఉదయం ఆమనగల్ ప్రాంతంలో ట్యాక్సీ డ్రైవర్‌తో కలిసి ఆమె బస్సులో వస్తుండగా శంషాబాద్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. తాను అల్వాల్‌లో ఉన్న సమయంలోనే ట్యాక్సీ డ్రైవర్ ట్రాప్ చేశాడని ఆ యువతి తెలిపింది. అతడికి చెప్పకుండా లండన్‌కు వెళ్లానన్న కోపంతో ఉన్నాడని, నేను వెంటనే హైదరాబాద్‌కు రాకుంటే తన భర్తను చంపేస్తానంటూ బెదిరించాడని, బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు చెప్పింది. తనను తన భర్త దగ్గరకు పంపించాలంటూ బతిమాలింది. సోమవారం రాత్రి ఆమెను లండన్‌కు పంపించారు. ట్యాక్సీ డ్రైవర్‌ను విచారిస్తే తానేమీ ఆమెను బలవంతంగా తీసుకెళ్లలేదని, ఆమే వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ నెల 5వ తేదీన తన పుట్టిన రోజని, ఆమెను ఇక్కడికి రమ్మంటే వచ్చిందని అన్నాడు. తానేమీ బ్లాక్ మెయిలింగ్, కిడ్నాప్ చేయలేదని పోలీసులకు వివరించాడు. ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉందని భావించిన పోలీసులు ఆ ట్యాక్సీ డ్రైవర్‌ను వదిలిపెట్టారట!