తెలంగాణ(Telangana) వెదర్‌మ్యాన్(Weatherman) ఎవరో తెలుసా?
తెలంగాణ(Telangana) వెదర్‌మ్యాన్(Weatherman) ఎవరో తెలుసా? వాతావరణం గురించి ఆయన చెప్పింది పొల్లుపోకుండా నిజమవుతున్నదన్న విషయం తెలుసా? అందరికీ తెలిసుండకపోవచ్చు కానీ ట్విట్టర్‌లో వాతావరణ వార్తలు చూసేవారికి మాత్రం ఈ తెలంగాణ వెదర్‌మ్యాన్ చాలా పాపులర్. ట్విట్టర్ (ఎక్స్)వేదికగా తెలంగాణ వెదర్ అప్‌డేట్స్ ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ వ్యక్తి పేరు బాలాజీ. సోషల్ మీడియాలో ఐఎండీతో పాటు చాలా మంది వెదర్‌మ్యాన్‌లు ఉన్నా బాలాజీ చెప్పింది మాత్రం నిజమవుతుంటుంది. ఈ రోజు వర్షం పడుతుందంటే పడాల్సిందే! ఎండ కాస్తుందంటే కాయాల్సిందే! దటీజ్ బాలాజీ. ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్టు అందించి, అందరినీ అలర్ట్ చేస్తున్న బాలాజీని తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెగ మెచ్చేసుకున్నారు. వాతావరణ హెచ్చరికలతో అద్భుతంగా పని చేస్తున్న యువకుడు బాలాజీకి అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మీ ఉదార సేవకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే టి.బాలాజీ ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. ట్విట్టర్‌లో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తనదైన శైలిలో ఉపయోగించుకుంటూ వర్షాకాలంలో తాజా వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తుంటాడు.