ఫార్ములా ఈ వ్యవహారంలో ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫార్ములా ఈ వ్యవహారంలో ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ ని ఎంతో కష్టపడి తీసుకోచ్చామన్నారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చేందుకే ఫార్ములా - ఈ గొప్ప ఎజెండాతో ముందుకు తీసుకువచ్చామని.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్, తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా పని చేశామన్నారు. ఫార్ములా - ఈ సందర్భంగా నిర్వహించిన ఈ - మొబిలిటీ వీక్ ద్వారా 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని.. నీచమైన రాజకీయాలు చేసే కుంచిత మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదన్నారు. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజన్‌ను, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారన్నారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. తాను మంత్రిగా ఉండి తన బావమరిదిలకు కాంట్రాక్టులు ఇప్పించుకోలేదని, నా కొడుకు కంపెనీలకు కాంట్రాక్టులు ఇప్పించుకోలేదని, 50 లక్షల బ్యాగ్‌ను మోసుకొని వెళ్లి ఎమ్మెల్యేలను కొనేందుకు చేసినవారిలాగా లుచ్చా పనులను తాను చేయలేదని కేటీఆర్ అన్నారు. నిఖార్సైన తెలంగాణ బిడ్డను, కేసీఆర్ సైనికుడినని.. ఎన్నికేసులనైనా ఎదుర్కొంటానని కేటీఆర్ అన్నారు.