ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Koushik reddy) ఇంటిని కేటీఆర్(KTR) పరిశీలించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Koushik reddy) ఇంటిని కేటీఆర్(KTR) పరిశీలించారు. అరికేపూడి గాంధీ(Arikepudi gandhi) అనుచరుల దాడిలో పగిలిన కిటికీ అద్దాలను, ఇతర పరిసరాలను పరిశీలించి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి,రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను మోసం రేవంత్ రెడ్డి చేసిండన్నారు. ముఖ్యమంత్రి స్వయంగ ఎమ్మెల్యేల ఇంటికి చేరి కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతాడని, పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు.. ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు(Congress), ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతారు. హైకోర్టు తీర్పు తర్వాత(High court) కాంగ్రెస్‌లో భయం మొదలైందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి.. చావు డప్పులు కొట్టండి అని మాట్లాడిందే రేవంత్ రెడ్డి అని అన్నారు.
రేవంత్‌రెడ్డి(Revanth reddy) ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని, గత పదేళ్లుగా తెలంగాణలో ఎప్పుడూ లేని సంస్కృతి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారని అన్నారు. పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి ర్యాలీగా వచ్చి దాడి చేయించారని విమర్శించారు. ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్యతోనే కొట్లాడినమని వాళ్ల ముందు నువ్వెంత అని అన్నారు. నువ్వొక బుల్లబ్బాయివని, నీ అంత పనికిమాలిన ముఖ్యమంత్రిని ఎవరినీ చూడలదేంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో 10 ఏళ్లుగా ఎలాంటి ప్రాంతీయ విభేదాలు రాకుండా అందరినీ కేసీఆర్ కాపాడుకున్నారన్నారు. అందరినీ సమానంగా చూడడంతోనే బీఆర్‌ఎస్‌కు అన్ని సీట్లు అప్పగించారన్నారు. తన పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో హైదరాబాద్ ప్రజలపై రేవంత్ పగబట్టారన్నారు. హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, వరదలు వస్తే ఆదుకునే దిక్కులేదన్నారు. హెడ్‌లైన్ల కోసం నువ్వెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా రుణమాఫీ, రైతుబంధు, ఆరు గ్యారెంటీల అమలుపై నిన్ను, నీ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తేలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అరికేపూడి గాంధీ తానే కాంగ్రెస్‌లో చేరానని ప్రకటించి, మళ్లీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాననడం పెద్ద కామెడీగా ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయాల్సిందేన్నారు. మొన్నటి ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో 9,500 కోట్ల అభివృద్ధి పనులు కేసీఆర్ చేయించారని ఓట్లు అడిగిన గాంధీ, ఇప్పుడు ఏం అభివృద్ధి చేసి పొడుస్తాడని కాంగ్రెస్‌లో చేరాడని ప్రశ్నించారు.