మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలనుద్దేశించి ఎమోషనల్ ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలనుద్దేశించి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా తాను ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్‌లో ' ప్రాణ సమానులైన... మన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. గత ఏడాది కాలంగా ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి శిరస్సువంచి సలాం చేస్తున్నా. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా మీరు క్షేత్రస్థాయిలో కనబరిచిన కదనోత్సాహం.. రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కూడా మాటలకందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపింది. తెలంగాణ గ్రామ గ్రామాన ఉన్న గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజలపక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ఈ తుగ్లక్ పాలన వల్ల కష్టకాలంలో ఉన్న రైతుల పక్షాన మీరు పోరాడారు, నేతన్నల గొంతుకై మీరు నిలిచారు,
మహిళా సమస్యలపై మీరు గర్జించారు, బడుగు బలహీనవర్గాల ప్రజల గళమయ్యారు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించారు..
నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కారును నిలదీశారు, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు.
“మూసీలో మూటలవేట” నుంచి “లగచర్ల లడాయి” వరకూ అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన మీరు కొట్లాడారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా మీరు ప్రతిధ్వనించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు మీరు చేసిన పోరాటాలు.. చరిత్రపై చెరగని సంతకాలు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు ఈ పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అసమర్థ, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన “జంగ్ సైరన్” ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించింది. మీ అలుపెరగని పోరాటాల వల్లే అదానీ ఆశజూపిన రూ.100 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. లగచర్ల లడాయి.. యావత్ దేశం ముందు నియంతృత్వ కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టింది. ఎన్నో అక్రమ కేసులు పెట్టినా,
ప్రభుత్వం ఎంత వేధించాలని చూసినా, మొక్కవోని ధైర్యంతో మీరు నిలబడ్డ తీరు అపూర్వం... అసాధారణం... చారిత్రాత్మకం. దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ప్రశ్నిద్దాం ! నిలదీద్దాం!! అడ్డుకుందాం!!!
మన పార్టీకి పునాది రాళ్లు మీరే, మన BRSకు మూలస్తంభాలు మీరే, మన గులాబీ జెండాకు.. వెన్నుముక మీరే. పార్టీ తరఫున నిలబడి.. కలబడే.. నేటి అలుపెరగని పోరాట యోధులే రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలు. గులాబీ సైనికులందరికీ... గుండెల నిండా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై తెలంగాణ.. జై KCR' అంటూ కేటీఆర్ ఎక్స్‌వేదికగా కార్యకర్తలను ఆకాశానికి ఎత్తుకున్నారు.