ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరానికి రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు(Hyderabad Lands) ఎకరానికి రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ(Telangana) పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని సీఎం తెలిపారు.
తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించ పరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరెంత నష్టం చేయాలని చూసినా ధృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని అన్నారు.
హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న హెచ్ ఎండీఏ అధికారులను, మంత్రి కేటీఆర్(Minister KTR) ను,హెచ్ ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ఎంఏయూడీ(MAUD) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్(Aravind Kumar) ను సీఎం కేసీఆర్ అభినందించారు.
ఆల్ టైం రికార్డు :
ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో గురువారం జరిగిన భూముల ఈ వేలం(E-Auction) ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొనన్నాయి. ఈ సందర్భంగా జరిగిన వేలంలో తెలంగాణ భూములకు కనీవినీ ఎరుగని ధర పలికింది. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) గండిపేట మండలం(Gandipet Mandal) కోకాపేట(Kokapet) లోని నియో పోలీస్ ఫేస్ టు(Nio Police Phase-2) లో జరిగిన వేలంపాటలో ఎకరానికి రూ. 100.75 కోట్లను చెల్లించి పోటీదారులు ప్లాట్లను స్వంతం చేసుకున్నారు.