తెలంగాణ రాష్ట్ర సమితి(TRS).. జనం నోళ్లలో నానిన పేరు ఇది! తెలంగాణ(Telangana) భావోద్వేగాలతో ముడిపడిన పేరు ఇది!
తెలంగాణ రాష్ట్ర సమితి(TRS).. జనం నోళ్లలో నానిన పేరు ఇది! తెలంగాణ(Telangana) భావోద్వేగాలతో ముడిపడిన పేరు ఇది! తెలంగాణతో మమేకమైన పేరు ఇది! ఇంత చక్కటి పేరును కాదని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు అధినేత కేసీఆర్(KCR). అనకూడదు కానీ అప్పట్నుంచే ఆ పార్టీకి కష్టాలు రావడం మొదలయ్యాయి. చివరికి ఎన్నికల్లో పరాజయం పాలయ్యే వరకు వచ్చింది. అక్కడితో ఆగిందా? ఆ పార్టీలోని నాయక పక్షులు ఆ గూటిని వదిలేసి అధికారపక్షంవైపుకు ఎగిరిపోతున్నారు. బెల్లం చుట్టూ ఈగలు అంటారే అలాగన్నమాట! అందుకే అర్జెంట్‌గా బీఆర్‌ఎస్(BRS) పేరు మార్చేసి టీఆర్‌ఎస్‌గా పెట్టాల్సిందేనని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. అనడం కాదు డిమాండ్ చేస్తున్నారు. అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంత మంది ఇన్ని రకాలుగా చెబుతుంటే పూర్వపు పేరు ఉండటమే సముచితమని కేసీఆర్ కూడా అనుకుంటున్నారట! ఈ క్రమంలో పార్టీ పేరు మార్పుకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్‌ఎస్ ఆలోచిస్తోంది. పార్టీ పేరును మళ్ల టీఆర్ ఎస్‌గా మార్చేందుకు ఏం చేయాలన్నదానిపై కసరత్తులు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కూడా పరిశీలిస్తోంది. బీఆర్‌ఎస్ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చడం సాంకేతికంగా సాధ్యమేనట! ఎన్నికల సంఘం నిబంధనలలో ఆ అంశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎందుకు మళ్లీ పార్టీ పేరును మారుస్తున్నారో వివరంగా చెప్పమని ఎన్నికల సంఘం అడిగితే అందుకు కూడా బీఆర్ఎస్ ప్రిపేర్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితిపేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. పేరు మార్పు కోసం బీఆర్‌ఎస్ చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తే ఓటర్లలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందా అన్న విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్ పేరుకు ఎన్నికల సంఘం ఓకే చెబితే కారు గుర్తు దక్కుతుందా లేదా అనే విషయాన్ని కూడా బీఆర్‌ఎస్ అధ్యయనం చేస్తోంది. పేరు మార్పుకు అవసరమైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నియమావళిలో సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. బీఆర్‌ఎస్ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చడంపై పార్టీ చేసే విజ్ఞప్తిని ఆమోదించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. అలాగే తిరస్కరించినా తిరస్కరించవచ్చు. అందుకే ఎన్నికల సంఘం నియమావళిని గులాబీ పార్టీ అధ్యయనం చేస్తోంది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పేరు మార్పు అంశంపై తీర్మానం చేసే అవకాశముందట! తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాల తర్వాత బీఆర్‌ఎస్‌గా మారిందన్న విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ 5వ తేదీన భారత రాష్ట్ర సమితిగా మారింది. పార్టీ పేరు మార్పిడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంటు, అసెంబ్లీలోనూ బీఆర్‌ఎస్ పేరు మార్పునకు ఆమోదముద్ర పడింది.