తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rashtra Samithi) పేరుతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) తదనంతరం ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తూనే వచ్చారు. మొట్టమొదటిసారిగా ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది.
తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rashtra Samithi) పేరుతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) తదనంతరం ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తూనే వచ్చారు. మొట్టమొదటిసారిగా ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు. పార్టీని స్థాపించిన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఓడిపోవడంతో పార్టీ క్యాడర్‌లో కాసింత నిరాశ నెలకొన్నది. ఉత్సాహం సన్నగిల్లింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు కూడా సిద్ధపడటం లేదట! కొందరేమో పక్కదారులు చూసుకున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో నేతలకు, కార్యకర్తలకు మనో ధైర్యం కల్పించడానికి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం క్యాడర్‌లో ఉంది. ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ మాత్రం పోటీకి దూరంగా ఉండాలనే అనుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పేరుతో పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారిగా 2004లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ తర్వాత 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాంతో పాటుగా మెదక్ లోక్‌సభకు కూడా పోటీ చేశారు. రెండు చోట్లా విజయం సాధించారు. మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత(Kavitha) నిజామాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేసీఆర్(KTR) పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. కేసీఆర్ కాకపోతే కవిత అయినా బరిలో దిగుతారని అనుకున్నారు. కానీ అవి జరగలేదు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి కవిత బరిలో దిగుతారనే వార్తలు వచ్చాయి. అది కూడా జరగలేదు. ఈ మధ్యలో ఢిల్లీ లిక్కర్ స్కాము(Delhi Liquor Scam)లో కవిత అరెస్టయ్యారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి(BajiReddy Goverdhan) పోటీ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కేటీఆర్ పోటీ చేస్తారనే టాక్ వినిపించింది. అదీ జరగలేదు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ దగ్గర బంధువు జోగినపల్లి సంతోష్‌కుమార్(Joginapally Santosh Kumar)పదవీ కాలం కూడా వచ్చే నెల 2వ తేదీన ముగియబోతున్నది. దీంతో, పార్లమెంటు ఉభయ సభల్లో కేసీఆర్ ఫ్యామిలీ, బంధువులుగా ఒక్కరూ కూడా లేకపోవడం ఇదే మొదటిసారి. పార్టీ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు క్యాడర్‌లో ఆత్మస్థయిర్యాన్ని నింపాల్సిన కేసీఆర్ ఫ్యామిలీ ఇలా ఎన్నికలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమయ్యింది. బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) ఇలాంటి సంక్షోభాలను ఎన్నింటినో చూసింది. బీఆర్‌ఎస్ పని అయిపోయిందని గతంలో కూడా చాలా సార్లు చాలా మంది అనుకున్నారు. కానీ బీఆర్‌ఎస్ మాత్రం పడి లేచిన కెరటం మాదిరిగా పునరుజ్జీవం పొందింది. పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.. ఈసారి కూడా అదే జరగవచ్చు.. కలకాలం ఒక రీతి గడవదంటారు.. వాడిన గులాబీ వికసిస్తుందనే నమ్మకం క్యాడర్‌లో ఇంకా అలాగే ఉంది.