పక్కింటి అబ్బాయిని ప్రేమించి, తమకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న కూతురుపై పీకల్దాక కోపం పెంచుకున్నారు తల్లిదండ్రులు.
పక్కింటి అబ్బాయిని ప్రేమించి, తమకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న కూతురుపై పీకల్దాక కోపం పెంచుకున్నారు తల్లిదండ్రులు. ఆ కోపంతో పొరుగింటికి దారి లేకుండా రోడ్డుపై గోడకట్టేశారు. ఈ చిత్రమైన సంఘటన కరీంనగర్(Karimnagar) జిల్లాలోని శంకరపట్నం(shankarapatnam) మండలం ఎరడపల్లి గ్రామంలో జరిగింది. మమత అనే అమ్మాయి పొరుగింట్లో ఉండే కనకం రత్నాకర్‌ను ప్రేమించింది. అతడు కూడా మమతను ప్రేమించాడు. లాస్టియర్ ఫిబ్రవరి 16న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి మమత తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కొత్త దంపతులు కేశపట్నంలోని ఓ అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. రత్నాకర్ తల్లిదండ్రులు మాత్రం ఎరడపల్లిలోనే నివసిస్తున్నారు. అత్తారింటికి వెళ్లాలంటే మమత తన తల్లిగారింటి మీదుగానే వెళ్లాల్సి ఉంది. దాంతో రత్నాకర్ కుటుంబం ఆ దారిగుండా వెళ్లకుండా మమత కుటుంబసభ్యులు ఆరు నెలల కిందట రోడ్డుపై అడ్డంగా సిమెంట్ ఇటుకలతో గోడ కట్టారు. అప్పట్నుంచి గత్యంతరం లేక దొడ్డిదారి నుంచే వారు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే తన అత్తగారింటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి ఇబ్బందులు పెడుతున్నారంటూ తల్లిదండ్రులపై కేసు పెట్టింది మమత! నాలుగు రోజుల కిందట కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని మమత కోరుతోంది.