15 రోజుల పాటు 2 గంటలు స్టేషన్‌కు వచ్చి డ్యూటీ చేయాలని జడ్జి తీర్పు
పూటు పూటుగా మద్యంతాగి మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారకులైన ఓ యువతీ, యువకుడికి న్యాయమూర్తి వెరైటీ తీర్పు ఇచ్చారు. బెయిల్‌పై తీర్పునిస్తూ వినూత్న రీతిలో శిక్ష విధించారు. వివరాల ప్రకారం వెస్ట్‌మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో ఉంటున్న తీగుళ్ల దయాసాయిరాజ్ (27), ఆయన స్నేహితురాలు గత నెల 27న ఫిలింనగర్ సమీపంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఓ పార్టీలో మద్యం తాగారు. అర్ధరాత్రి 2.30 గంటలకు దయాసాయిరాజ్ తన TS 10 FF 9666 బెంజ్ కారులో స్నేహితురాలిని పక్కన కూర్చోబెట్టుకుని అతివేగంతో వెళ్తున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద కారు అదుపుతప్పింది. దీంతో డివైడర్‌తో పాటు కరెంట్ పోల్ కూడా ధ్వంసమయ్యాయి. ఎయిర్ బ్యాగ్‌లు తెర్చుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని డ్రంక అండ్ డ్రైవ్ టెస్టులు చేయగా మద్యం తాగినట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసుకొని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అయితే ఆయన షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. బెయిల్ వచ్చిన నాటి నుంచి 15 రోజుల పాటు ప్రతీరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రిసెప్షన్‌లో కూర్చొని స్టేషన్‌కు వచ్చినవారిని నవ్వుతూ పలకరించాలని, అంతేకాకుండా ఆ సమయంలో మాస్ కూడా ధరించకూడదని చెప్పారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో స్టేషన్‌కు వచ్చినట్లు సంతకం చేయాలని ఆదేశించారు. దీంతో దయాసాయిరాజ్‌తో పాటు అతని స్నేహితురాలు ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రిసెప్షన్‌లో కూర్చొని అక్కడికి వచ్చిన వారిని నవ్వుతూ పలకరిస్తున్నారు.