తెలంగాణలో నిరుద్యోగుల(TS unemployed) ఆందోళన తీవ్ర తరమవుతోంది. గత పదిహేను రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. డిఎస్‌సి పరీక్ష విషయంలోనూ, గ్రూప్ 1 విషయంలోనూ నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతోంది. పరీక్షను వాయిదా వేయాలని, గ్రూప్ 1(Group 1) ఇంటర్వ్యూకు పిలిచే అభ్యర్థుల శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. పట్టించుకోకపోవడానికి గల కారణమేమిటో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతున్నది. నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తారా? మమ్మల్ని ప్రశ్నలడుగుతారా? వంటి లేనీపోనీ ఇగోను ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక నిరుద్యోగుల కృషి ఎంతో ఉంది. నిరుద్యోగులందరూ ప్రభుత్వం మారాలని కోరుకున్నారు. మార్పు కోసమంటూ దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. బీఆర్‌ఎస్ హయాంలో పరీక్షా పత్రాలు లీక్(Paper leak) అవ్వడం, తరచూ పరీక్షలు వాయిదా పడుతుండటంతో నిరుద్యోగులు అసహనానికి గురయ్యారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిసైడయ్యారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకే నిరుద్యోగుల వ్యతిరేకతను చవి చూస్తున్నది. నిరుద్యోగులు తాము చెప్పింది వినండంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం చాలా లైట్ తీసుకుంటోంది. నిరుద్యోగుల దగ్గరకు మంత్రో, ముఖ్యమంత్రో వెళ్లి మాట్లాడితే పోయిందేమి ఉంటుంది.