అండమాన్‌లోని(andaman) కాలపానీ, మయన్మార్‌(Mayanmar) (ఒకప్పటి బర్మా)లోని మాండలే కారాగారాలు చాలా ప్రసిద్ధి.

అండమాన్‌లోని(andaman) కాలపానీ, మయన్మార్‌(Mayanmar) (ఒకప్పటి బర్మా)లోని మాండలే కారాగారాలు చాలా ప్రసిద్ధి. స్వాంతంత్ర్య సమరయోధులను బ్రిటిష్‌ పాలకులు ఆ జైళ్లలోనే వేసేవారు. బాలగంగాధర్‌ తిలక్‌ మాండలే జైలులో ఆరేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించారు. ఆ జైళ్లలో ఖైదీలకు విధించే శిక్షలు దారుణాతి దారుణంగా ఉంటాయి. చాలా మంది ఆ శిక్షలను తట్టుకోలేక చనిపోతారు కూడా! కాలాపానీ, మాండలే జైళ్లలాగే అండా సెల్స్‌ కూడా! అక్టోబర్‌ 13వ తేదీన కన్నుమూసిన మానవ హక్కుల కార్యకర్త, మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబా(GS Sai baba) అండాసెల్స్‌లోనే కఠినమైన శిక్షను అనభవించారు. నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో తొమ్మిదేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన సాయిబాబా అండా సెల్‌లో అత్యంత కఠినమైన కారాగారశిక్షను భరించారు. నకిల స్టాంప్‌ పేపర్ల కుంభకోణంలో అబ్దుల్‌ కరీం తెల్గీ, అక్రమంగా ఆయుధాలు కలిగి వున్న కేసులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కూడా అండా సెల్‌లో ఉన్నారు. రోజులోని 24 గంటల్లో 22.5 గంటలు అత్యంత కఠిన ఏకాంత నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. ఇది తల్చుకుంటేనే భయం కలుగుతుంది. ప్రజల మనిషి సాయిబాబా మరణం తర్వాత అండా సెల్‌ గురించిన చర్చ సాగుతోంది. అసలు అండా సెల్‌ అంటే ఏమిటి? ఎక్కడ ఉంది? ఎలాంటి వారిని ఈ సెల్‌లో ఉంచుతారు? అనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. అండా సెల్‌ అంటే గుడ్డు ఆకారంలో ఉండే నిర్మాణం. అండా అంటే గుడ్డు! ఈ సెల్‌లో రెండు విభాగాలు ఉంటాయి. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో 50X50 అడుగుల కంపార్ట్‌మెంట్లుగా ఉంటుంది. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఎరవాడ, నవీ ముంబైలోని తలోజా, నాగపూర్‌ సెంట్రల్‌ జైళ్లలో ఈ అండా సెల్స్‌ ఉన్నాయి. ఇక్కడే కాదు దేశంలోని పలు సెంట్రల్‌ జైళ్లలోనూ ఈ అండా సెల్స్‌ ఉన్నాయి. ఎరవాడలోని అండా సెల్‌ను 1990లో నిర్మించారు. అత్యంత కరడు గట్టిన నేరస్తులను, మోస్ట్‌ వాండెట్‌ ఉగ్రవాదులను, తీవ్రవాదులను, గ్యాంగ్‌స్టర్‌లను. వ్యవస్థీకృత నేరాలు చేసినవారిని ఇందులో ఉంచుతారు. ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ వైద్యను హత్య చేసిన హర్జీందర్‌ సింగ్‌ జిందా, సుఖ్‌దేవ్‌ సుఖాలను ఉరి తీసే ముందు 1992లో ఎరవాడలోని అండా సెల్‌లోనే తొలిసారిగా ఉంచారు. అమృత్‌సర్‌లో స్వర్ణమందిరం దగ్గర ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు నాయకత్వం వహించింది వైద్యనే! రెండు భాగాలుగా ఉండే అండా సెల్స్‌ జైలు అధికారుల పెట్రోలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వీటిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. అండా సెల్స్‌లో బాహ్య, అంతర్గత భద్రతా వలయాలు ఉంటాయి. మిగతా బ్యారక్‌లతో పోలిస్తే అండా సెల్స్‌ను పర్యవేక్షించడానికి ఎక్కువ మంది జైలు అధికారులు ఉంటారు. అండా సెల్‌లో శిక్ష భయంకరంగా ఉంటుంది. రోజులో 22.5 గంటల పాటు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. ఇనుప కడ్డీలు, జైలు ఊచలు తప్ప మరో మనిషి జాడ కనిపించదు. ఎత్తయిన గోడలే తప్ప కిటికీలు ఉండవు. బయట ప్రపంచం అసలు కనిపించదు. గాలి కూడా చొరబడదు. అందుకే స్వచ్ఛమైన ఆక్సిజన్‌ కూడా అందదు. లైబ్రరీ, క్యాంటీన్‌కు వెళ్లే అవకాశం ఉండదు. బాత్రూమ్, టాయిలెట్‌ కూడా అండా సెల్‌లోనే ఉంటాయి. అండా సెల్‌ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కుటుంబ సభ్యులతో ములాఖత్‌ కావడానికి అవకాశాలు ఉండవు. ఏ ఖైదీని అండా సెల్‌కు పంపాలనేది ఆ జైలు సూపరింటెండెంట్‌ నిర్ణయిస్తారు.

Updated On 15 Oct 2024 9:22 AM GMT
Eha Tv

Eha Tv

Next Story