Rain : రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు వాతావరణ పరిస్థితులను వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీయనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఈరోజు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఈదురు గాలులతో కూడిన ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నిన్న తెలంగాణలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారులు సూచించారు.