హైదరాబాద్ నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి రానుంది. హైదరాబాద్ మీర్ ఆలం ట్యాంక్ మీదుగా
హైదరాబాద్ నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి రానుంది. హైదరాబాద్ మీర్ ఆలం ట్యాంక్ మీదుగా చింతల్‌మెట్ రోడ్‌ను బెంగుళూరు జాతీయ రహదారిని కలుపుతూ రెండవ కేబుల్-స్టేడ్ బ్రిడ్జిని త్వరలో నిర్మించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.363 కోట్ల అంచనాతో నాలుగు లేన్ల హైలెవల్ వంతెనకు అనుమతులు మంజూరు చేసింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మీర్ ఆలం ట్యాంక్‌పై 4-లేన్ కేబుల్ వంతెన నిర్మాణాన్ని మంజూరు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి ధన్యవాదాలంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అసదుద్దీన్. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని అని.. మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ ఉన్న పనులు జీవనోపాధిని సృష్టించడంలో సహాయపడుతుందని వివరించారు.
మీర్ ఆలం ట్యాంక్ మీదుగా 2.65 కి.మీ. ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్లాన్ చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది, హైదరాబాద్‌లో టూరిజం అభివృద్ధి చెందుతుంది. మూసీ నదికి దక్షిణంగా ఉన్న మీర్ ఆలం ట్యాంక్, హైదరాబాద్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి మీర్ ఆలం బహదూర్ పేరు పెట్టారు. ఇది ఒకప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఏర్పాటుకు ముందు హైదరాబాద్ వాసులకు తాగునీటి వనరుగా ఉండేది. ఇప్పటికే హైదరాబాద్ లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఉన్న సంగతి తెలిసిందే!! రెండో కేబుల్ బ్రిడ్జి త్వరలోనే రానుంది.