గురువారం నాడు హైదరాబాద్ నగరాన్ని వాన మరోసారి ముంచేసింది
గురువారం నాడు హైదరాబాద్ నగరాన్ని వాన మరోసారి ముంచేసింది. వాతావరణ నివేదికల ప్రకారం తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం వర్షాలు కురుస్తున్నాయని.. గురువారం సాయంత్రం పౌరులకు కీలక సూచనలు కూడా జారీ చేసింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 11.6 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కృష్ణానగర్‌లో 9, షేక్‌పేటలో 8.65, అంబర్‌పేట్‌లో 8.45, నాంపల్లిలో 8.3, ఖైరతాబాద్‌లో 7.73 సెం.మీ. నమోదైంది.
సిద్దిపేట, కరీంనగర్, మెదక్, వనపర్తి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సిరిసిల్ల, భువనగిరి, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్‌లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద తలదాచుకోవడం ప్రమాదకరమని ఐఎండీ సూచించింది. విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా వెళ్లాలని ప్రజలను హెచ్చరించారు. GHMC-DRF సహాయం కోసం అధికారులు 040-21111111 , 9000113667 హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేశారు.