హైదరాబాద్(Hyderabad) ప్రజల్లో చాలా మందికి ట్రాఫిక్స్(Traffic rules) సెన్స్ బొత్తిగా ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా వెళుతుంటారు.
హైదరాబాద్(Hyderabad) ప్రజల్లో చాలా మందికి ట్రాఫిక్స్(Traffic rules) సెన్స్ బొత్తిగా ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా వెళుతుంటారు. రోడ్డు వాళ్ల సొంతమైనట్టు రాంగ్ రూట్‌లో(Wrong route) వెళుతూ మిగతావారికి ఇబ్బందులు కలిగిస్తుంటారు. ఇక నుంచి అలా సాగదు. రాంగ్ రూట్‌లో వెళ్లే వారిపై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేసి జైలుకు పంపబోతున్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్లేనని తేలింది. అందుకే ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేయడానికి సైబరాబాద్ పోలీసులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొదటి సారిగా రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులపై 336 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం మొదలు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. రాంగ్‌రూట్‌లో వచ్చి పట్టుబడిన వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ ఠాణాలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చార్జీషీట్ దాఖలు చేస్తారు. శుక్రవారం రోజున కమిషనరేట్ పరిధిలో రాంగ్‌రూట్ వాహనాలు నడిపిన 93 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో అత్యధికంగా 32 మంది రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ పట్టుపడ్డారు. వీరిలో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలో అయిదుగురు దొరికారు. కూకట్‌పల్లి పరిధిలో ముగ్గురు పట్టుబడితే వారిలో ఒకరిపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. మాదాపూర్‌లో ఆరుగురు పట్టుబడితే ఒకరిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. నార్సింగి ఠాణా పరిధిలో 11 మంది పట్టుబడగా, వారిలో ఒకరిపై, రాయదుర్గం పరిధిలో 20 మంది పట్టుబడితే , వారిలో ఇద్దరిపై, జీడిమెట్ల పరిధిలో 16 మంది పట్టుబడితే , వారిలో ఒకరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.