హైదరాబాద్ లో నేడు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటోర్యాలీ నిర్వహించనున్నట్టు

హైదరాబాద్ నగరంలో నేడు ఆటోల బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపు నిచ్చారు. మహాలక్ష్మీ పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఉచిత బస్సుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది.

హైదరాబాద్ లో నేడు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటోర్యాలీ నిర్వహించనున్నట్టు యూనియన్ నాయకులు తెలిపారు. నేడు ఆటోల బంద్‌కు సంబంధించి తెలంగాణ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు (జేఏసి) రవాణాశాఖ కమిషనర్‌ను కలిసి సమ్మె నోటీసుచ్చింది. ఈ బంద్‌కు క్యాబ్‌లు, డిసిఎం, లారీ డ్రైవర్‌లు కూడా మద్ధతు తెలిపినట్టు ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. ఆటోలనే నమ్ముకుని బతుకుతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు.. ఇల్లు గడిచేలా తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని వేడుకున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ఫైనాన్స్‌ ద్వారా తెచ్చిన ఆటోలకు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో ఆటోడ్రైవర్లపై ఒత్తిడి చాలా ఎక్కువవుతోంది. తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతూ ఉన్నారు

Updated On 15 Feb 2024 10:54 PM GMT
Yagnik

Yagnik

Next Story