ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దుండగులు.
ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దుండగులు.అడ్డుకున్న ఆటో డ్రైవర్ పై దాడి.. బాలికను ఇంట్లో వదిలిపెట్టినా కూడా వదలని కామాంధులు. హైదరాబాద్‌లో బీహార్‌కు చెందిన బాలిక బోరబండలోని తన దగ్గరి బంధువుల వద్ద ఉంటూ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నది. అయితే జీతం కోసం మాదాపూర్ వెళ్లింది. ఈ క్రమంలో అదే హోటల్‌లో కుక్‌గా పనిచేసే బీహార్‌కు చెందిన యువకుడి (18)తో కలిసి రాత్రి 10.40 గంటల సమయంలో బోరబండ వెళ్లే ఆటో ఎక్కింది. సంత ప్రాంతం వద్ద ఐదుగురు యువకులు ఆటోను అడ్డగించి.. వారిలోంచి ఇద్దరు ఆటో ఎక్కగా, వారిలో ఒకడు బాలిక పక్కన కూర్చుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మిగతా వారు ఆటోను అనుసరిస్తూ బైక్‌పై వచ్చారు.బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బాలిక స్నేహితుడితోపాటు ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో యువకులు దాడికి తెగబడ్డారు.. అయినప్పటికీ ఆటో డ్రైవర్ ధైర్యంగా వారితో పోరాడి ఆటో నుంచి వారిని బయటకు తోసేసి ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చాడు. అయినా వదలని నిందితులు పరుగులు పెడుతూ ఆటోలోకి చేరుకున్నారు. అయినా ఆటోను ఆపని డ్రైవర్ నేరుగా బాలిక ఇంటి వద్ద ఆమెను దింపేశాడు. అయినప్పటికీ నిందితులు ఇంట్లోకి చొరబడి బాలికను బాత్రూంలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బాలిక బంధువులు వారి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వదల్లేదు. దీంతో కాపాడాలంటూ బాలిక చేస్తున్న ఆర్తనాదాలు విని పొరుగింటి వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు.. దీంతో పోలీసులు వచ్చి నిందితులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.