లాల్‌దర్వాజ కొలువైన సింహవాహిని అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నది. ఉదయం నుంచే భక్తులు బోనాలను సమర్పించుకుంటున్నారు.

లాల్‌దర్వాజ(Laldarvaja Bonalu) కొలువైన సింహవాహిని అమ్మవారి(Sri Simhavahini Ammavaru) ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నది. ఉదయం నుంచే భక్తులు బోనాలను సమర్పించుకుంటున్నారు. ఆనంద భాగ్యసిరికి ఆషాఢంలో అమ్మను, గ్రామదేవతా రూపాల్లో దర్శించి ఆరాధించే సంప్రదాయం తెలంగాణలో అనాదిగా కొనసాగుతోందని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ప్రస్తావించాడు. దుర్గతి, దుష్టత్వం, దుఃఖం వంటి ప్రతికూలతల్ని నశింపజేసే మాతృశక్తిని బోనాల జాతర పేరిట తెలంగాణ పరివ్యాప్తంగా తమదైన శైలిలో పూజిస్తారు. అన్న పదార్థాల్ని అమ్మతల్లికి నివేదన చేస్తారు. ఆషాఢంలో ఆడబిడ్డగా, జగదంబను తమ ఇంటికి ‘పసుపుబొట్టు' పేరిట ఆహ్వానించి, అమ్మకు చీరసారెల్ని సమర్పిస్తారు. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రకృతి సిరిసంపదలతో కళకళలాడాలని ఆకాంక్షిస్తారు.'భోజనం' అనే సంస్కృత పదం నుండి ఈ పేరు వచ్చింది. ఇది బోనంగా మారింది మరియు తరువాత బోనాలుగా పిలువబడింది. యజ్ఞ ద్రవ్యంగా వినియోగించే అన్నాన్ని ఆశ్రయించి సూక్ష్మ భూమిక వహించే దేవతాశక్తులు విలసిల్లుతాయి. ఆ శక్తుల ప్రభావం వల్లే జీవులకు ఆకలి బాధ నివారణ చెందుతుంది. అందుకే శక్తి సంధాత్రి అయిన అన్నాన్ని పవిత్ర రూపంగా భావిస్తారు. ఆ ఆహారాన్ని అందించిన ఆదిశక్తికి కృతజ్ఞతాపూర్వకంగా 'బోనం' రూపంలో అదే అన్నాన్ని సమర్పిస్తారు. కాకతీయ సామ్రాజ్యంలో ఆషాఢమాసంలో కాకతి మాత ముంగిట అన్నపురాశుల్ని, వివిధ వంటకాల్ని ఉంచి, నివేదన చేశాక, 'మహా భోజనం' పేరిట అన్న సంతర్పణ చేసేవారంటారు. 'బోనం' అంటే భాగ్యోదయమైన దివ్యత్వానికి సంకేతం. బోనం కుండ మన శరీరానికి సంకేతం. అందులోని పదార్థం జీవత్వానికి ప్రతిఫలనం. ఆ పదార్థంపై వెలిగే జ్యోతి, ఆత్మదీపం. దీప సహిత జీవాత్మను పరమాత్మతో మమేకం చేసే ప్రక్రియే బోనాల సమర్పణ..

Eha Tv

Eha Tv

Next Story