తీవ్రమైన వేసవి వేడితో అల్లాడిపోతున్న ప్రజలకు మంగళవారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది.
తీవ్రమైన వేసవి వేడితో అల్లాడిపోతున్న ప్రజలకు మంగళవారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది. హైదరాబాద్ నగరంతోపాటు కరీంనగర్ లోని కొన్ని ప్రాంతాలు, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, హుజూరాబాద్, గంబీరావుపేట, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
భారీ వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన వరి పంట తడిసింది. ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మామిడి తోటల రైతులకు భారీ నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లాలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు నేలకొరిగాయి. అకాల వర్షంతో రైతులు పంట నష్టపోయి కంట కన్నీరు పెడుతున్నారు.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. సిద్దిపేటలో 6.6 మిమీ, కరీంనగర్‌లో 6.2 మిమీ, కుమురం భీమ్ 5.3, పెద్దపలిలో 2.9 మిమీ, మంచిర్యాలలో 4.5 మిమీ, రాజన్న సిరిసిల్లలో 3.3 మిమీ వర్షపాతం నమోదైంది.
ఐఎండీ తెలంగాణలోని తొమ్మిది జిల్లాలను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తూ.. “మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం కుమ్రం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.