హైదరాబాద్‌లోని నాగోలులో స్థానికులు, పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నాగోలులో స్థానికులు, పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులకు ఇద్దరికీ చూపు లేదు. కొడుకు విగత జీవిగా ఇంట్లో పడి ఉన్నా వారు కనిపెట్టలేకపోయారు. దుర్వాసన వస్తుంటే ఇంట్లో ఏ పిల్లో, ఎలుకనో చనిపోయిందనుకున్నారు. మూడు రోజులుగా తిండిలేక గడిపారు. తన కొడుకు వచ్చి అన్నం పెడతాడని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. నాగోల్(Nagole) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ అంధుల కాలనీలో రమణ(Ramana), శాంతి కుమారి(Shanti kumari) అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు తన భార్యతో వేరు కాపురం ఉంటున్నాడు. రెండో కుమారుడు ప్రమోద్(Pramodh)కు పెళ్లయినా తనకున్న దురలవాట్లతో విసిగి ఆమె వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులతోనే ప్రమోద్ ఉంటూ పెయింటింగ్ పనిచేసుకుంటున్నాడు. ఈక్రమంలోనే మూడు రోజుల క్రితం మద్యం మత్తులో ఉన్న ప్రమోద్ నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. ఇతనికి ఫిట్స్ కూడా వస్తుంటాయి. తల్లిదండ్రులకు కళ్లు కనపడకపోవడంతో కొడుకు చనిపోయిన విషయాన్ని గుర్తించలేకపోయారు. ఓ వైపు ఆకలి.. మరోవైపు కుమారుడు చనిపోయిన విషయాన్ని గుర్తించ లేక మూడు రోజుల పాటు ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయారు. మూడు రోజుల త్వరాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న నాగోల్ సీఐ సూర్యనాయక్(Nagole CI Surya Nayak), ఎస్సై శివనాగప్రసాద్(SI Sivanaga Prasad) వృద్ధ దంపతులను చూసి చలించిపోయారు. కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండగా.. మంచానికి కొంత దూరంలోనే వృద్ధ దంపతులు ఉండడంతో ఈ దృశ్యం చూసి పోలీసులకు కంటనీరు ఆగలేదు. మూడురోజులుగా తిండి లేకపోవడంతో వారు ఏమీ చెప్పలేకపోయారు. వృద్ధ దంపతులను బయటకు తీసుకొచ్చి వారికి స్నానం చేయించి ఆహారం అందించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.