కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్ కనిపిస్తుంద‌ని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పదవులను, కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందన్నారు.

కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్ కనిపిస్తుంద‌ని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పదవులను, కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందన్నారు. పార్టీ మారేదే లేదని చెప్పిన శ్రీహరి ఎందుకు మారాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కడియంకు నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. దొంగలతో కండువా కప్పించుకునే స్థాయికి శ్రీహరి దిగజారుడు అవసరమా? అని ప్ర‌శ్నించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ఆ పార్టీలోకి శ్రీహరి పోయిండని అన్నారు. కష్టపడే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుంది. ద్రోహం చేసినవాళ్లను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. వరంగల్ తొలి నుంచి ఉద్యమాల గడ్డ. బీఆర్ఎస్‌కు అండగా ఉంది. కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తక్కువేన‌న్నారు. వరంగల్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసింది. ఐదు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి, టెక్స్ టైల్ పార్క్‌ తెచ్చామ‌న్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తీసేస్తామని రేవంత్ అంటున్నారు. అదే జరిగితే వరంగల్ అగ్నిగుండమవుతుందన్నారు. కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది. కాకతీయ తోరణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. రెండు లక్షల రుణమాఫీ, పింఛన్ పెంపు, రైతుబంధు పెంపు, వడ్లకు బోనస్, మహిళలకు 2500.. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. ఈ హామీలు అమలైన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటువేయండి, కానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండని సూచించారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు. కష్టాలు మనకు కొత్తకాదు. రేవంత్ నాయకులను కొనగలడేగాని ఆత్మగౌరవమున్న ఉద్యమ నాయకులను కొనలేడన్నారు.

నిరుద్యోగులకు 4 వేల భృతి ఇస్తామని వాళ్లనూ మోసం చేసింది కాంగ్రెస్. ఆ హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అబద్ధమాడిండన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. వడ్లను రూ. 2500కు కొన్నాకనే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడగాలని డిమాండ్ చేశారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించి చెప్పండి. అన్ని చోట్లా చర్చ పెట్టండని శ్రేణుల‌కు సూచించారు. ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు బీజేపీకి కూడా వస్తోంది. రైతుల ఉసురు పోసుకున్న చరిత్ర బీజేపీదన్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం ఆకలి పెరిగాయి. అన్నీ పడిపోతున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు మాత్రం పెరిగిపోతున్నాయని అన్నారు. బీజేపీ మాట వింటే జోడీ, వినకపోతే ఈడీ.. కాంగ్రెస్, బీజేపీ ఒకటేన‌న్నారు. మేం బీజేపీతో చేతులు కలిపితే కవిత ఎందుకు జైలుకు వెళ్తుందన్నారు

కాంగ్రెస్ వచ్చాక ముస్లిం సోదరులకు తోఫా బంద్ అయింది. మైనారిటీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. మీరు బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అసెంబ్లీలో హామీలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. ప్రశ్నించే బలాన్నిమాకివ్వాలని కోరారు. రేవంత్ పేగులు మెడలో వేసుకోకుండా, పేదలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మానవబాంబులా మారకుండా మానవీయ పాలన అందించాలన్నారు.

రేవంత్ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని.. ఒక్కనాడన్నా వాళ్ల కుటుంబాలను పరామర్శించావా? ఒక్క రూపాయన్నా ఇచ్చి ఆదుకున్నావా? అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని అంటున్నారు. తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ పాలపొంగు అన్న టీడీపీనే తెలంగాణలో లేకుండా పోయింది. కేసీఆర్ పొలం బాట కార్యక్రమానికి అద్భుత స్పందన వస్తోందన్నారు. ఆరు నూరైనా, అటు సూర్యుడు ఇటు పొడిచినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే అని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. దానికి ఓటు వేయడం వ్యర్థం అని సూచించారు.

Updated On 1 April 2024 5:38 AM GMT
Yagnik

Yagnik

Next Story