కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Give full details on Medigadda, CM Revanth Reddy’s order to the officials
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project)కు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష(Review Meeting) నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy), ఈఎన్ సీ మురళీధర్(Muralidhar), సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
