గద్వాల(Gadwal) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి(Krishnamohan reddy) మొహమాటం కూసింత ఎక్కువే!
గద్వాల(Gadwal) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి(Krishnamohan reddy) మొహమాటం కూసింత ఎక్కువే! మగాడైపోయాడు కానీ లేకపోతే ఈ మొహమాటంతో ఏదో జరిగిపోయేది! మొహమాటం ఎక్కువ కాబట్టే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి(BRS) వెళ్లిపోతే కాంగ్రెస్ ఏమనుకుంటుందోనన్న మొహమాటం! పోనీ కాంగ్రెస్‌లోనే(congress) ఉండిపోతే బీఆర్‌ఎస్ ఎక్కడ చీప్‌గా అనుకుంటుందేమోనన్న మొహమాటం! ఇప్పటికైతే ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు లెక్క! మరి రేపు ఎటు ఉంటారో చెప్పలేం! 1967లో హర్యానాలోని హసన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం (ఇప్పుడది హోడల్‌గా మారింది) నుంచి స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు గయా లాల్(Gaya Lala). ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే కాంగ్రెస్ నుంచి యునైటెడ్ ఫ్రంట్‌లోకి జంపయ్యారు. పోనీ అక్కడైనా తిన్నగా ఉన్నారా అంటే వెంటనే మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. రెండు రోజుల్లోనే మళ్లీ యునైటెడ్ ఫ్రంట్‌లోకి వెళ్లిపోయారు. ఈ కప్పదాట్లన్నీ పది రోజుల వ్యవధిలోనే జరగడం చిత్ర విచిత్రం. 1984లో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్‌లో నిర్మల్ ఎమ్మెల్యే భీమ్‌రెడ్డి గురించి కూడా ఇట్టాగే చెప్పుకున్నారు. కొన్ని రోజులు ఎన్టీఆర్ శిబిరంలో, కొన్ని రోజులు నాదెండ్ల శిబిరంలో ఉంటూ వచ్చారు. కానీ గయా లాల్ మాదిరిగా తడవతడవకో రంగులు మార్చలేదు. ఇప్పుడు గయా లాల్ రికార్డును బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తుడిపేస్తారేమోనన్న డౌటానుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆయన తీరుతెన్నులు అలా ఉన్నాయి కాబట్టి! అన్నట్టు బీఆర్‌ఎస్‌కు తిరిగి వచ్చేశారు కదా! అప్పుడాయన ఏమన్నారు? తాను అసలు కాంగ్రెస్‌లో చేరనే చేరలేదని, తాను వేసుకున్నది కాంగ్రెస్ కండువా కాదని, అది దేవుడి కండువా అని అన్నారు కదా! నిన్న మళ్లీ ఆయన దేవుడి కండువా వేసుకుని ఫోటోలకు పోజులిచ్చారు! దేవుడి కండువా అనగా మూడు రంగలు కండువా అని అర్థం చేసుకోవాలి! అన్నట్టు మొన్న బీఆర్‌ఎస్‌లోకి మళ్లీ వచ్చేసినట్టు కలరింగ్ ఇచ్చిదంతా ఓ మహానాటకమన్నది చాలా మందికి వస్తున్న అనుమానం! బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన బండ్ల కాంగ్రెస్‌కు ఊరికే వెళ్లరు కదా! ఏదో ఆశించే వెళ్లి ఉంటారు కదా! కాంగ్రెస్‌లో చేరినప్పడు తాను పెట్టిన షరతులేవీ ఫుల్‌ఫిల్ కాకపోవడంతో కాంగ్రెస్ నాయకత్వాన్ని బెదరించడానికి బీఆర్‌ఎస్‌లోకి వచ్చేసినట్టు డ్రామాలాడారని గులాబీ శ్రేణులు అనుకుంటున్నాయి. అలా అనుకోవడంలో తప్పేమీ లేదు కూడా! మొహమాటస్తుడైన బండ్ల చాలా తెలివైన వారు కూడా! ఇప్పటి వరకు మీడియా ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటేనే ఆయన ఎంత జాగ్రత్తపరుడో అర్థమవుతోంది. తాను బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లానట్టుగానీ, కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరినట్టుగానీ, తూచ్ తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని గానీ ఎక్కడా పెదవి విప్పి చెప్పలేదు. మనమే దృశ్యాలు చూసి అర్థం చేసుకోవాలి. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిది సైలెంట్ సినిమా అన్నట్టు! మొత్తం మీద రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేని వారికి కూడా ఆయా బండ్ల గయా బండ్ల ఎపిసోడ్ బాగా ఆకట్టుకుంటోంది. చూడాలి ఆయన కాంగ్రెస్‌లో ఎన్ని రోజులుంటారో!