ఒకప్పుడు హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలలో జోరుగా షుషారుగా తిరిగిన డబుల్‌డెక్కర్ బస్సులు(Double Decker Buses) చాన్నాళ్ల కిందట ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ రోడ్ల మీద తిరగడం మొదలు పెట్టాయి. కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్(Hussainsagar) చుట్టూ మూడు ఎలక్ట్రిక్(Electric Double Decker) డబుల్‌డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి.
ఒకప్పుడు హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలలో జోరుగా షుషారుగా తిరిగిన డబుల్‌డెక్కర్ బస్సులు(Double Decker Buses) చాన్నాళ్ల కిందట ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ రోడ్ల మీద తిరగడం మొదలు పెట్టాయి. కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్(Hussainsagar) చుట్టూ మూడు ఎలక్ట్రిక్(Electric Double Decker) డబుల్‌డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. గమనించదగ్గ విషయమేమిటంటే సందర్శకులు, పర్యాటకులు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
గత ఏడాది నిర్వహించిన అంతర్జాతీయ ఫార్ములా -ఈ పోటీల సందర్భంగా హెచ్‌ఎండీఏ(HMDA) ఈ బస్సులను కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి మూడు బస్సులు తీసుకుంది. కొననైతే కొన్నారు కానీ చాన్నాళ్ల పాటు ఈ బస్సులను రోడ్డుమీదకు తీసుకురాలేదు. పార్కింగ్‌లోనే పెట్టారు.
నగర రోడ్లపై తిప్పడానికి పలు దఫాలుగా సర్వేలు చేశారు. అయినప్పటికీ రూట్‌లను ఖరారు చేయలేదు. దీంతో పార్కింగ్‌కే పరిమితమైన ఈ బస్సులను ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టూ తిప్పుతున్నారు. సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారకం ఏర్పాటు తర్వాత నెక్లెస్ రోడ్డుకు వచ్చే సందర్శకులు విపరీతంగా పెరిగారు. నగరానికి చెందిన వారే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు, విదేశీ పర్యాటకులు కూడా నెక్లెస్ రోడ్డు, ట్యాంకుబండ్ పరిసరాలను సందర్శించడానికి వస్తున్నారు.
ఈ క్రమంలో హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలను సందర్శించడానికి ఈ డబుల్‌డెక్కర్ బస్సులను వినియోగిస్తున్నారు. ఇవి టూరిస్టులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ మూడు బస్సులు తిరుగుతున్నాయి. సంజీవయ్య పార్క్, థ్రిల్‌సిటీ, లేక్‌ఫ్రంట్ పార్క్, జలవిహార్, నీరా కేఫ్, పీపుల్స్ ప్లాజా, ఇందిరాగాంధీ విగ్రహం, పీవీ నరసింహారావు విగ్రహం, అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించిన తర్వాత సెక్రటేరియట్‌కు వెళుతుంది.
అక్కడ బస్సు దిగిన టూరిస్టులు కాసేపు అమరుల స్మారకాన్ని సందర్శించి తిరిగి బస్సులోనే ట్యాంక్‌బండ్‌వైపుకు వెళ్లవచ్చు. తర్వాత ఈ డబుల్ డెక్కర్ బస్సులు ట్యాంక్‌బండ్ మీదుగా తిరిగి సంజీవయ్య పార్కుకు వస్తాయి. బస్సు మొదటి అంతస్తులో కూర్చొని ఈ రూట్‌లో ప్రయాణం చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. రోజూ ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు డబుల్‌డెక్కర్ బస్సుల్లో హుస్సేన్‌సాగర్ చుట్టూ తిరగవచ్చు. సాయంత్రం 5 గంటల నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మరోవైపు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో కూడా డబుల్‌డెక్కర్ బస్సులకు డిమాండ్ ఉంటోంది.