Harish Rao : కూల్చివేత రాజకీయాలు మానేసి వారిని ఆదుకోండి
వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10,000 పరిహారం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10,000 పరిహారం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేత రాజకీయాలు మానేసి వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. వరదల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు సహాయం కోసం నిస్సహాయంగా ఎదురు చూస్తున్నారని ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రజలు ఆపదలో ఉంటే మీరు రాజకీయాలు మాట్లాడటం శోచనీయం. ప్రజల కన్నీళ్లు తుడవాల్సింది పోయి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు. మీలాగా మేము విమర్శలు చేయలేక కాదు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం ముఖ్యం. సహాయక చర్యలపై ముందు దృష్టి సారించండని సూచించారు. విపత్తు నిర్వహణలో, వరద బాధితులను ఆదుకోవడంలో మీరు పూర్తిగా విఫలం అయ్యారు. ప్రజలు మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.
వరదల నేపథ్యంలో వైరల్ జ్వరాలు విజృంభించే అవకాశం ఉందని, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, ప్రజలకు తాగునీరు, ఆహారం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.