Vikarabad Man Death News : చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు.. అసలేం జరిగిదంటే..!
చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వస్తే కుటుంబసభ్యుల ఆనందం చెప్పనలవి కాదు. వికారాబాద్ జిల్లా(Vikarabad District) బషీరాబాద్ మండలం(Basheerabad Mandal)లోని నంవాద్గికి చెందిన పిట్టల ఎల్లప్ప(Piiatala Yellappa)కుటుంబసభ్యులకు ఇలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారిప్పుడు. ఎల్లప్ప చనిపోయాడని మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు ఎల్లప్ప బతికివచ్చాడు. అసలేం జరిగిందంటే 40 ఏళ్ల ఎల్లప్ప పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ దగ్గర వ్యవసాయపనులు చేస్తుంటాడు. రెండు రోజుల క్రితం తాండూరుకు వెళుతున్నానని భార్య ఇమలమ్మకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తాండూరుకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవటంతో ఇమలమ్మ ఆందోళన చెందింది. తెలిసినవారందరిని అడిగింది. ఎవరూ ఎల్లప్ప గురించి చెప్పలేకపోయారు. ఇదిలా ఉంటే శనివారం గ్రామానికి చెందిన నర్సిరెడ్డికి వికారాబాద్ రైల్వే పోలీసుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. రైలు కిందపడి ఓ వ్యక్తి చనిపోయాడని, అతడి మొబైల్‌లో మీ సెల్‌ఫోన్ నంబర్ ఉన్నదని, మీరెవరు? ఏ గ్రామం? అంటూ రైల్వే పోలీసులు ప్రశ్నించారు. చనిపోయింది ఎల్లప్పనే అనుకున్నాడు నర్సిరెడ్డి. ఎల్లప్ప వివరాలను పోలీసులకు చెప్పాడు. దీంతో ఎల్లప్ప మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వికారాబాద్ రావాలంటూ పోలీసులు చెప్పారు. నర్సిరెడ్డి ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు. గ్రామస్తులలో కొందరిని, ఎల్లప్ప భార్యను తీసుకుని శనివారం వికారాబాద్‌కు వెళ్లేసరికి రాత్రి అయ్యింది. ఆదివారం ఉదయం వారు ఆ మృతదేహాన్ని చూశారు. గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో సరిగా పోల్చుకోలేకపోయారు. పోస్టుమార్టం అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అప్పటికే బంధువులు, గ్రామస్థులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఎల్లప్ప తాండూరులో కనిపించాడని తెలిసినవారు ఫోన్ చేసి చెప్పారు. కుటుంబసభ్యులంతా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని ఎల్లప్పకు తెలియటంతో హూటాహుటిన గ్రామానికి వచ్చాడు. ఎల్లప్ప తిరిగి రావడంతో భార్య, కుటుంబీకులు, గ్రామస్థులు ఆనందించారు. కొసమెరుపు ఏమిటంటే, ఎల్లప్ప మొబైల్ ఫోన్‌ను ఎవరో దొంగిలించాడు. ఆ దొంగే రైలు ప్రమాదంలో చనిపోయాడు. ఎల్లప్ప ఫోన్ చనిపోయిన వ్యక్తి దగ్గర ఉండటంతో రైల్వే పోలీసులు అది ఎల్లప్పదేనని అనుకున్నారు. ఇక మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసిన గొయ్యిలో కోడిపిల్లను పెట్టి పూడ్చారు. అదో సెంటిమెంట్!