బీఆర్ఎస్(BRS) అధిష్టానం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కన్నెర చేసింది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivas reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao)పై
బీఆర్ఎస్(BRS) అధిష్టానం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కన్నెర చేసింది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivas reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao)పై బీఆర్‌ఎస్ (BRS) పార్టీ సస్పెన్షన్(Suspension) వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR)ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం సస్పెన్షన్ వేటు విషయమై ప్రకటన చేసింది.
సస్పెన్షన్ పై పొంగులేటి స్పందించారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దొరలగడి నుంచి ఇన్ని రోజులకు విముక్తి లభించిందన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలం తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2014లో జరిగిన 16వ లోకసభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి పోటీచేసి.. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ లోనే కొనసాగారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టిక్కెట్ లబించే అవకాశాలు తక్కువ. దీంతో ఆయన పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కొత్తపార్టీ పెట్టనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ జాతీయ పార్టీలో చేరుతానని పొంగులేటి చెబుతున్నారు. ఏ పార్టీలో చేరుతారనేది సస్పెన్స్‌గా ఉంది.
జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే. తెలంగాణ ప్రభుత్వ మాజీ మంత్రి. ఈయన తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. కాంగ్రెస్‌కు చెందిన జూపల్లి కృష్ణారావు.. 1999, 2004, 2009, 2012 ఉపఎన్నిక, 2014లలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు ఎన్నికై తిరుగులేని నేతగా చరిత్ర సృష్టించారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. 2011 అక్టోబరు 30న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుండి పార్టీకి అంటిముట్టనట్టు ఉంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే ఆత్మీయ సమ్మేళనానికి వచ్చానని అన్నారు. ఇరువురు కలయికపై సీరియస్‌గా ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం సస్పెషన్ వేటు వేసింది.