దళిత బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నాయకులమంతా కలిసికట్టుగా నిలదీద్దామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
దళిత బంధు(Dalitha Bandu)పై కాంగ్రెస్(Congress) ప్రభుత్వ వైఖరిని నాయకులమంతా కలిసికట్టుగా నిలదీద్దామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) పిలుపునిచ్చారు. మహబూబాబాద్(Mahabubabad) లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భారీగా హాజరైన ఈ కార్యకర్తలను చూస్తుంటే బీఆర్ఎస్(BRS) ఓడిపోలేదనిపిస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మరచిపోయి పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేసి గెలుద్దామన్నారు. గిరిజనుల్లో ఉన్న కొన్ని అపోహలు తొలగించి తిరిగి వారి మద్దతు బీఆర్ఎస్ కు కూడగట్టేలా ప్రయత్నం జరగాలన్నారు.
అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కూడా అనుకోలేదని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్(Tellam Venkatrao) అన్నారు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లతో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ సర్కార్ దేనని పేర్కొన్నారు. మనం చేసినవి సరిగా చెప్పలేక పోయాం. జరిగిందేదో జరిగింది.. ఇక పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారిద్దామన్నారు. నేతలంతా సమన్వయంతో పని చేసి మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు.