TS Elections 2023 : మేం ఓటేసే ప్రసక్తే లేదు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) పోలింగ్ (Polling)ప్రశాంతంగా సాగుతోంది. కొన్ని చోట్ల పార్టీల కార్యకర్తలు గొడవ పడుతున్నారు. హైదరాబాద్ ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. పోలింగ్ మందకొడిగా నమోదవుతోంది. కొన్ని చోట్ల ఓటర్లు తాము ఓటేయమంటూ కరాఖండిగా చెబుతున్నారు. నిరసనలకు దిగుతున్నారు.

ఖమ్మం జిల్లా(Khammam) సత్తుపల్లి(Sathupalli) మండలం సత్యంపేట(Sathyampet) గ్రామంలో పోలింగ్‌ను బహిష్కరించారు గ్రామస్తులు. తమ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదంటూ ఓటును బహిష్కరించారు. వైరా నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. రెండు చోట్ల గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. ఏన్కూరు(Enkur) మండలం కొత్త మేడేపల్లి(Kotha Medepalli) గ్రామంలో రెండు దశాబ్దాలుగా రహదారులు , తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని చెబుతున్న గిరిజనులు తాము ఓటు వేయబోమన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఓటు వేయమని చెబుతున్నారు. అధికారులేమో వారిని బతిమాలుతున్నారు. బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏన్కూరు మండలం రాజుల పాలెం గ్రామంలోనూ ఇదే దృశ్యం. రాజుల పాలెం గ్రామం నుండి శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మించాలనే డిమాండ్ నెరవేరకపోవడంతో ఓటేయమని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. ఇంకొన్ని చోట్ల ఓటర్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని భీష్మించుకుని ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామపంచాయతీ పరిధిలోని సంతులాల్ పోడు ఎస్సీ కాలనీ ఓటర్లు డబ్బులిస్తే ఓటు అని చెప్పేశారు. 12 గంటల వరకు అక్కడ ఒక్క ఓటు పోల్ కాలేదు. బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. అందుకు కారణం తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయకపోవడమే అంటున్నారు.