Google Pay, PhonePe, Amazon Pay, Paytm వంటి UPI యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపులు ఇకపై చేయొచ్చు.
Google Pay, PhonePe, Amazon Pay, Paytm వంటి UPI యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపులు ఇకపై చేయొచ్చు. తెలంగాణకు చెందిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆర్‌బిఐ(RBI) ఆదేశాన్ని ఉటంకిస్తూ ఫోన్‌పే, గూగుల్ పే, బ్యాంకుల వంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులను ఆమోదించడాన్ని ఇంతకు ముందు నిలిపివేసింది. నార్త్, సౌత్ డిస్కమ్‌లు రెండూ ఇప్పుడు భారత్ బిల్ పేమెంట్(Bharath Bill Payment) సర్వీసెస్‌లో చేరడంతో వినియోగదారులు ఈ యాప్‌లను ఇప్పుడు మళ్లీ ఉపయోగించుకోవచ్చు. విద్యుత్తు బిల్లుల చెల్లింపులను సులువుగా మార్చేందుకు డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్‌టెక్ యాప్‌లు, వెబ్‌సైట్‌లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారానూ బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ జులై 1 నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది. బీబీపీఎస్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే చెల్లింపులు జరగాలని నిర్దేశించింది. ఈ క్రమంలో విద్యుత్ సంస్థలు బీబీపీఎస్‌లోకి వచ్చిన ఫలితంగా, డిస్కమ్‌లు ప్రతి లావాదేవీకి అదనంగా రూ. 2 జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది. దీని వలన రెండు డిస్కమ్‌లకు నెలకు రూ. 1.5 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. చెల్లింపుల కోసం డిస్కామ్ యాజమాన్యంలోని యాప్‌లను ఉపయోగించడం సురక్షితమైనదని, చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారులు ఏవైనా సమస్యలు ఎదురైతే డిస్కామ్ అధికారులను నేరుగా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఆర్‌బిఐ ఆదేశాలను అమలు చేయడానికి ముందు యాప్‌ల ద్వారా బిల్లు చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండేవి కావు.