నిర్మల్ జిల్లా(Nirmal District) తానూరు మండలం(Thanuru Mandal) బేల్‌తరోడాలో హృదయవిదారకర దృశ్యాలు కంటపడ్డాయి.
నిర్మల్ జిల్లా(Nirmal District) తానూరు మండలం(Thanuru Mandal) బేల్‌తరోడాలో హృదయవిదారకర దృశ్యాలు కంటపడ్డాయి. కొన్ని రోజుల క్రితమే అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు. తల్లి తీవ్రమనస్తాపం చెంది అనారోగ్యంపాలైంది. అనారోగ్యం నుంచి కోలుకున్నా ఆర్థిక కష్టాలు ఆమెను వెంటాడాయి. ఆర్థిక బాధలు తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అనాథగా మారిన కూతురు తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన(Begging) చేపట్టింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో మానవత్వం కలిగిన మనుషులంతా ఆమెపై జాలి చూపిస్తున్నారు.
బేల్‌తరోలో దుర్గ(Durga)అనే చిన్నారి ఉంది. తండ్రి అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితమే మరణించాడు. తల్లి గంగామణికి మనస్తాపానికి గురై అనారోగ్యంపాలైంది. ఆరోగ్యం కోలుకున్న తర్వాత కూతురు దుర్గతో కలిసి కూలీ చేసుకుంటూ గడిపేది. భర్త చనిపోవడం, తన అనారోగ్యంతో ఆర్థిక కష్టాలు వెంటపడ్డాయి. దీంతో సమస్యలు తట్టుకోలేక గంగామణి ఆత్మహత్య చేసుకుంది. తల్లి చనిపోయిన తర్వాత దుర్గ ఒంటరిదైంది. తల్లి మృతదేహం పక్కన కూర్చొని కన్నీరుమున్నీరుగా విలపించింది. తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలో తెలియదు. అంత్యక్రియలకు డబ్బు కూడా లేకపోవడంతో చుట్టుపక్కలవారిని అడుక్కుంది. దుర్గ గురించి తెలిసి చాలామంది ఆమెకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ కేసును విచారించడానికి వచ్చిన పోలీసులు కూడా దుర్గ పరిస్థితి చలించిపోయారు, తగినంత సాయం చేశారు. ఈ సంఘటన గురించి విన్న ఇతరులు కూడా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు విరాళంగా ఇచ్చారు. ఈ చిన్నారి విషాదకరమైన కథ ప్రతి ఒక్కరి మనసును తాకింది. 11 ఏళ్ల చిన్నారికి ఎంత కష్టమొచ్చింది అంటూ చాలామంది కన్నీరు పెట్టుకున్నారు.
అయితే ఈ వీడియో చూసిన బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)స్పందించారు. వెంటనే వెళ్లి ఆదుకోవాలని ముధోల్ నియోజకవర్గ నేతలకు చెప్పడంతో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు కొంత ఆర్థిక సాయం చేశారు. దుర్గను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు.
నేను దుర్గతో వ్యక్తిగతంగా మాట్లాడతా, ఆమె సురక్షితమైన భవిష్యత్తును నిర్మించడంలో మేము ఎలా సహాయపడగలమో ప్లాన్ చేస్తానని ఆయన అన్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా స్పందించి దుర్గ భవిష్యత్, చదువుపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.