Telangana : మాజీ సీఎం కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు నోటీసులు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్)పై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్ రాజలింగమూర్తి కోరారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (KLIS)పై రాజలింగమూర్తి(Rajalingamurthy) అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను స్వీకరించిన జయశంకర్ భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు(Bhupalapally first class magistrate court) సెప్టెంబర్ 5న తమ ముందు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR), మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు(Harish Rao)తో పాటు ఆరుగురు ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్)పై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్ రాజలింగమూర్తి కోరారు.
పన్ను చెల్లింపుదారుల సొమ్ము రూ.లక్ష కోట్ల దుర్వినియోగానికి కేసీఆర్ కారణమని.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని రాజలింగమూర్తి తన పిటిషన్‌లో ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నష్టంపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేసీఆర్, హరీశ్ రావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్(Rajath Kumar), సీఎంవో మాజీ కార్యదర్శి స్మితా సబర్వాల్(Smitha Sabarwal), అప్పటి చీఫ్ ఇంజనీర్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ప్రతినిధులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, పనుల్లో నాణ్యత పాటించలేదని, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ముందు భూసార పరీక్షలు కూడా చేయలేదని పిటిషనర్ ఆరోపించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) నిర్మాణంపై సాంకేతిక వివరాలను కోరినప్పటికీ.. ప్రతివాదులు వాస్తవాలను దాచడానికి ప్రయత్నించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.